ఎమ్మెల్యేసారూ...
చీపురుపల్లి/గుర్ల: ఎమ్మెల్యే గారికి రైతుల బాధలు వినే ఓపిక లేదట.. రైతుల కష్టాలు తెలుసుకునే అవసరం కూడా లేదట... కనీసం రైతులతో మాట్లాడే తీరిక కూడా లేదట.. కష్టాలు చెప్పుకుందామని వస్తే పోలీసులతో తోయించేస్తారా?.. పోలీసులు తమను తోసేస్తుంటే ఎదురుగా ఉన్న ఎమ్మెల్యే గారు నవ్వుతారా?.. ఇందుకేనా ఓట్లు వేసి గెలిపించుకున్నాం.. ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు ఇంటింటికీ వచ్చారు... తీరా ఓట్లు వేయించుకుని గెలిచిన తరువాత ఎమ్మెల్యేకు రైతులకు మధ్య పోలీసులు ఎందుకు వచ్చారు... ఎమ్మెల్యేను కలిసేందుకు వచ్చింది రైతులే కదా సంఘ విద్రోహ శక్తులు కాదు కదా.. పోలీసులు తోసేస్తుంటే రైతులకు గాయాలవుతున్నా నవ్వుతూ వెళ్లిపోతున్నారు తప్ప పట్టించుకోలేదంటూ చీపురుపల్లి ఎమ్మెల్యే కళావెంటరావు తీరును గుర్ల మండలంలోని కెల్ల, దమరసింగి, వల్లాపురం, మన్యపురిపేట, బెల్లానపేట గ్రామాలకు చెందిన రైతులు దుమ్మెత్తిపోశారు. ఓట్లేసి గెలిపించినందుకు తగిన శాస్తి చెప్పారంటూ మనోవేదనకు గురవుతున్నారు. పచ్చని భూముల్లో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుచేస్తే రైతుల భవిష్యత్ నాశనమవుతుందని కొద్ది నెలలుగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోకపోగా కనీసం స్థానిక ఎమ్మెల్యే కూడా ఓట్లు వేసి గెలిపించిన ప్రజల పక్షాన నిలబడకపోతే ఎలా అంటూ రైతులు మండిపడ్డారు. పచ్చని పొలాల్లో పారిశ్రామిక మంటల రాజేయడం తగదని, ఈ ప్రాంతానికి జరిగే నష్టాన్ని వివరించి తమ బాధలు చెప్పుకునేందుకు వెళ్తే ఎమ్మెల్యే అవకాశం ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
రైతులేమైనా సంఘ విద్రోహ శక్తులా...
ఎన్నికల ముందు ఇదే రైతులతో చేతులు పట్టుకుని భుజాలు రాసుకుని దద్ద, పెద్దయ్య, తమ్ముడు అంటూ మాట్లాడిన ఎమ్మెల్యే... ఇప్పుడెందుకు కలవనివ్వడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. తాము రైతులమే తప్ప సంఘ విద్రోహ శక్తులం కాదు కదా... శాంతియుతంగా తమ కష్టాలు చెప్పుకోవాలని వస్తే పోలీసులతో అడ్డగించి తోయించడం ఎంతవరకు న్యాయమంటూ రైతులు ఆవేదన వ్యక్తంచేశారు.
రైతుకు స్వల్ప గాయాలు
ఎమ్మెల్యేను కలిసేందుకు వెళ్లిన రైతులను తాడుతో పోలీసులు అడ్డుకున్నారు. ఎదురుగానే ఎమ్మెల్యే ఉన్నప్పటికీ రైతులను పంపించండని అనలేదు. దీంతో ఆవేదన చెందిన రైతులు ఎలాగైనా ఎమ్మెల్యేను కలిసి తమ గోడు చెప్పుకోవాలని ముందుకు సాగారు. దీంతో అడ్డుకున్న పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించే చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో దమరసింగి గ్రామానికి చెందిన మీసాల అసిరినాయుడు అనే రైతు కిందపడిపోవడంతో స్వల్ప గాయమైనట్లు రైతులు చెబుతున్నారు.
ఓ వైపు రైతన్నా మీకోసం... మరోవైపు రైతులకు మోసం..
ప్రభుత్వం ఓ వైపు రైతన్న మీ కోసం అంటూ కార్యక్రమం చేస్తూనే మరోవైపు అదే రైతులను మోసం చేస్తోంది. రైతులపై ప్రేమ ఉన్నట్లు కపట నాటకాలు ఆడుతున్నారు. కనీసం కష్టాలు చెప్పుకునేందుకు ఎమ్మెల్యే వద్దకు వెళ్తే పోలీసులతో అడ్డగించారు. రైతుల కష్టాలు వినకపోవడం దారుణం.
– మీసాల ప్రసాద్, స్టీల్‌ప్లాంట్ వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్షుడు, దమరసింగి, గుర్ల మండలం
కళా తీరు దారుణం
స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు వల్ల ఎంతో నష్టం కలుగుతుంది. పచ్చని పొలాల్లో పంటలు పండించకుండా పరిశ్రమలు ఏర్పాటు చేస్తే రైతాంగం కుదేలు అవుతుంది. ఇదే విషయాన్ని ఎమ్మెల్యేకు చెప్పాలని రైతులం వెళ్తే పోలీసులతో అడ్డగించడం దారుణం. రైతులు ఎదుర్కొంటున్న బాధలు వినకపోతే ఎలా?
– కెల్ల సూర్యనారాయణ, కెల్ల, గుర్ల మండలం
కష్టాలు చెప్పుకునేందుకు వస్తే
పోలీసులతో తోయించేస్తారా?
ఇందుకేనా ఓట్లు వేసి తమరిని
గెలిపించుకున్నాం..
రైతులమా లేక సంఘ విద్రోహ
శక్తులమా చెప్పండి
రైతులను మోసం చేయడం
న్యాయమేనా?
పోలీసు చర్యలతో అసిరినాయుడు
అనే రైతుకు స్వల్ప గాయాలు


