విజయనగరం ఫోర్ట్:
మామిడి, జీడి మామిడి రైతులు కష్టాల్లో కూరుకుపోయారు. పూత ఆశాజనకంగా వచ్చినప్పటికీ వాతావరణంలో మార్పులు, పొగమంచు, తెగుళ్లు, పురుగు ఆశించడం కారణంగా పూతనల్లగా మాడిపోయింది. జిల్లా వ్యాప్తంగా రైతులు నష్టపోయారు. మెట్ట, కొండ ప్రాంత భూములు ఉన్న చిన్న, సన్నకారు రైతులకు మామిడి, జీడి మామిడి పంటలే జీవనాధారం. ప్రకృతి సహకరించకపోవడంతో పంటపై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో పంటల బీమా ఉంటే పరిహారం అందేదని, ఆర్థికంగా ఆదుకునేదని రైతులు చెబుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉచిత పంటల బీమా పథకానికి మంగళం పాడేయడంతో రైతులకు కష్టాలు మొదలయ్యాయని వాపోతున్నారు. అధికారంలోకిరాక ముందు ఒకలా, వచ్చిన తర్వాత మరోలా చంద్రబాబు వ్యవహరించడంతో రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, బీమా ప్రీమియం చెల్లించినా పరిహారం ఇవ్వని పరిస్థితి నెలకొందని ఆరోపించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా కలెక్టరేట్ వద్ద ఏపీ రైతు, కౌలు, మామిడి, జీడిమామిడి రైతుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన చేశారు. రైతులను ఆదుకోవాలని, తక్షణమే ఉచిత పంటల బీమా పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. రైతుల కష్టాలు, నష్టాలు పట్టించుకోరా అంటూ నిలదీశారు. ఏపీ రైతు సంఘం కార్యదర్శి బి.రాంబాబు మాట్లాడుతూ గత ఏడాది పంటల బీమా చెల్లించిన రైతులకు బీమా కంపెనీతో ప్రభుత్వ పెద్దల మాట్లాడి బీమా సొమ్మును ఇప్పించాలన్నారు. నష్ట పోయిన మామిడి, జీడి మామిడి రైతులకు ఉచిత పంటల బీమా అమలు చేయాలన్నారు. ఎకరానికి లక్ష రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. జీడిమామిడికి కేజీకి మద్దతు ధర రూ.200 ప్రకటించి ఆర్‌ఎస్‌కేల ద్వారా కొనుగోలు చేయాలన్నారు. ఆందోళనలో రైతు సంఘం నాయకులు పైడపునాయుడు, ఆదినారాయణమూర్తి, శ్రీను, రవిరాజు, రైతులు పాల్గొన్నారు.
గత ప్రభుత్వంలో ఉచిత పంటల బీమా అమలు
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రైతులకు ఉచిత పంటల బీమాను అమలుచేసింది. విపత్తుల సమయంలో రైతులకు మేలు జరిగేది. బీమా సాయం ఠంచన్‌గా అందేలా ఏర్పాట్లు చేసేది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదంటూ రైతులు వాపోతున్నారు.
పరిహారం..
పరిహాసం..
గతేడాది మామిడి, జీడిమామిడి రైతులు వేలాదిమంది బీమా ప్రీమియం చెల్లించారు. మామిడి పంట నష్టపోతే ఎకరానికి రూ.40వేలు, జీడి మామిడికి రూ.30 వేలు బీమా వస్తుందని చెప్పడంతో మామిడి పంటకు 10,104 మంది రైతులు 6,358 ఎకరాలకు బీమా ప్రీమియం కింద రూ.1,27,16,000లు చెల్లించారు. జీడి మామిడి పంటకు 566 మంది రైతులు 378 ఎకరాలకు రూ.5,67,000లు బీమా ప్రీమియం చెల్లించారు. మామిడి పంటకు ఎకరానికి రూ.2 వేలు, జీడిమామిడికి రూ.1500 చొప్పన ప్రీమియం చెల్లించారు. గతేడాది మామిడి, జీడి మామిడి పంటలు దెబ్బతిన్నాయి. పంట దిగుబడి కూడ బాగా తగ్గిపోయింది. ప్రకృతి వైపరీత్యాలు కారణంగా పంట దెబ్బతింటే పంటలబీమా వర్తిస్తుందని ఆశపడ్డారు. ఏడాది గడిచినా ఇంతవరకు రైతులకు రూపాయి బీమా రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. కలెక్టరేట్ వద్ద ఆందోళన చేసి ఉన్నతాధికారులకు తమకు జరిగిన అన్యాయాన్ని తెలియజేశారు.


