విజయనగరం: కార్పొరేషన్ హోదా దక్కించుకున్న విజయనగరంలో మొదటి పాలకవర్గంగా సమున్నతరీతిలో సుపరిపాలన సాగించి విజయనగరం జిల్లా కేంద్రం రూపురేఖలు మార్చామని, నగరాన్ని సుందరంగా మలిచామని విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు ఉద్ఘాటించారు. గడిచిన ఐదేళ్లలో సుమారు రూ.200 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని స్పష్టంచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఎమ్మెల్యే, ఎంపీ నిధులు నుంచి రూపాయి కేటాయించలేదని, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులు తామే చేస్తున్నామంటూ చెప్పుకోవడం సిగ్గుచేటుగా పేర్కొన్నారు. మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి హయాంలో జరిగిన అభివృద్ధిపై కౌన్సిల్ సభ్యులు ప్రశంసలు కురిపించారు. నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి అధ్యక్షతన సోమవారం విజయనగరం కార్పొరేషన్ అత్యవసర సమావేశం నిర్వహించారు. సమావేశంలో భాగంగా ప్రధాన అజెండాలో 14 అంశాలు పొందుపరచగా... టేబుల్ అజెండాలో మరో 3 అంశాలను పొందుపరిచారు. వీటిపై చర్చించిన కౌన్సిల్ రెండు అంశాలను తిరస్కరించి మిగిలిన 15 అంశాలకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ శెట్టివీరవెంకట రాజేష్ మాట్లాడుతూ టీడీపీ కార్పొరేటర్ కర్రోతు రాధామణి ఐదేళ్లలో అభివృద్ధి జరగలేదంటూ చేసిన వాఖ్యలకు ధీటుగా బదులిచ్చారు. ఐదేళ్ల కిందట టీడీపీ కౌన్సిల్ సభ్యులు మధ్య సమన్వయలేమితో రూ.60 కోట్ల సాధారణ నిధులు ఖర్చు చేయకుండా వదిలేశారని గుర్తు చేశారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ఆలోచనలతో ఆ నిధులతో పాటు వివిధ గ్రాంట్‌ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. తమ హాయాంలోనే ప్రభుత్వ మెడికల్ కళాశాలతో పాటు డిగ్రీ కళాశాలలు ప్రారంభించామని చెప్పారు. దేశంలోనే రెండవ ప్రభుత్వ ఏసీ పాఠశాలుగా కొత్తపేటలోని వివేకానంద పాఠశాల గుర్తింపు పొందిందన్నారు. నగర వ్యాప్తంగా 23 ఫౌంటైన్‌లు ఏర్పాటు చేయడంతో పాటు మహిళలు, చిన్నారుల కోసం ప్రత్యేకంగా పార్కులు నిర్మించామన్నారు. నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు 11 వాటర్ ట్యాంక్‌లు నిర్మించడంతో పాటు రోడ్ల విస్తరణ, వార్డుల్లో రోడ్లు, కాలువలు నిర్మాణాలు, ప్రాంతాల వారీగా ప్రభుత్వాస్పత్రుల నిర్మాణాలు చేపట్టామని వివరించారు. టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయం కోసం గతంలో కేటాయించిన స్థలాన్ని రద్దు చేసి తాజాగా వారు కోరిన ప్రాంతంలో స్థలం కేటాయించిన ఘనత ఈ పాలకవర్గానికే దక్కుతుందన్నారు.
● నగర డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి మాట్లాడుతూ మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభధ్రస్వామి ఆలోచనలతో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దామని కౌన్సిల్ మొత్తం గర్వంగా చెబుతుందన్నారు. ప్రతి డివిజన్‌లో సుమారు రూ.2.50 కోట్ల నుంచి రూ.5 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా పాలన సాగించామని పేర్కొన్నారు.
● కార్పొరేటర్లు మారోజు శ్రీనివాసరావు, అల్లు చాణక్య, మీసాల రమాదేవి, బాలి పద్మావతి, కడియాల రామకృష్ణ, పిన్నింటి కళావతి, రేగాన రూపాదేవి, తాళ్ల పూడి సంతోషికుమారి తదితరలు మాట్లాడుతూ గడిచిన ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి, సంతృప్తికర పాలనపై చర్చించడంతో పాటు రానున్న రోజుల్లో నగర అభివృద్ధికి అధికారులు ప్రాధాన్యమివ్వాలని కోరారు. సామూహిక మరుగుదొడ్లు, పారిశుధ్య నిర్వహణపై దృష్టి సారించాలని సూచించారు. ఆప్కోస్‌లో పారిశుధ్య కార్మికులుగా విధులు నిర్వహిస్తూ మృతి చెందిన 9 మంది కార్మికుల కుటుంబాలకు ఆ విధులు అప్పగించాలని కోరారు. కార్పొరేటర్‌గా సేవలందిస్తూ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందిన పొట్నూరు శ్రీనివాసరావు మృతికి కౌన్సిల్ సభ్యులు సంతాపం తెలిపారు. కుటుంబానికి అండగా ఉంటామని కో ఆప్షన్ సభ్యుడు ఆశపు వేణు భరోసా ఇచ్చారు.
పాలనకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు
మున్సిపల్ కార్పొరేషన్ మొదటి మేయర్‌గా పాలనకు సహకరించిన తోటి కార్పొరేటర్లకు, అధికారులకు, ప్రజలకు మేయర్ విజయలక్ష్మి ధన్యవాదాలు తెలిపారు. అందరి సహకారంతో నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని చెప్పారు. తాము చేసిన అభివృద్ధి ఫలాలను పరిరక్షిస్తూ భవిష్యత్‌లో విజయనగరం మరింత అభివృద్ధి దిశగా పయనించాలని ఆకాంక్షించారు. మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభధ్రస్వామి సారధ్యంలో నగరంలో చేపట్టిన పనులకు అన్ని వర్గాల ప్రజల నుంచి ఆనందం వ్యక్తం చేయడం పాలనకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు. సమావేశంలో కార్పొరేషన్ కమిషనర్ బాలస్వామి, అసిస్టెంట్ కమిషనర్ కిల్లాన అప్పలరాజు, కార్పొరేటర్‌లు, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
రూ.200కోట్లతో అన్నిరంగాల్లో
విజయనగరాన్ని సుందరంగా
తీర్చిదిద్దాం
ప్రజాసంక్షేమం, అభివృద్ధి కోసం
అకింత భావంతో పనిచేశాం
టీడీపీ కార్యాలయం నిర్మాణానికి
స్థలం కేటాయించిన ఘనత మాదే
పాలనకు సహకరించిన ప్రజలకు, అధికార యంత్రాంగానికి
కృతజ్ఞతలు తెలిపిన కార్పొరేటర్లు


