మార్కెట్ భూమ్
● ఫిబ్రవరి 1 నుంచి పొలాలకు కొత్త ధర
● గెజిట్ విడుదల చేసిన ప్రభుత్వం
● ప్రాంతాన్ని బట్టి మారనున్న రేట్లు
వీరఘట్టం/పాలకొండ: భూముల మార్కెట్ విలువ పెంపునకు రిజిస్టేషన్ శాఖ ప్రతిపాదనలు సిధ్ధం చేస్తోంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా పాలకొండ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని ఎల్.ఎన్.పేట, బూర్జ, రేగిడి, సంతకవిటి, పాలకొండ, వీరఘట్టం, భామిని మండలాలు ఉన్నాయి.ఈ ఏడు మండలాలకు సంబంధించి 350 రెవెన్యూ గ్రామాలున్నాయి.ఈ గ్రామాల్లో సుమారు 20 శాతం వరకు భూముల మార్కెట్ విలువ పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నూతనంగా సవరించనున్న మార్కెట్ విలువ ప్రకారం పాలకొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో రూ.35 కోట్ల వరకు అదనంగా ఆదాయం పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
ప్రతిపాదన ఇలా..
ప్రస్తుతం పాలకొండ నగర పంచాయతీలో ఎకరా భూమి మార్కెట్ ధర రూ.17 లక్షలు ఉంది. కొత్త నిబంధనల ప్రకారం 20 శాతం పెరుగుతుంది. అంటే ఎకరాకు అదనంగా రూ.3.40 లక్షలు పెరుగుతుంది. ఈ మేరకు ఫిబ్రవరి 1 నుంచి పాలకొండ నగర పంచాయతీలో భూమి ఎకరా మార్కెట్ ధర 20.40 లక్షలకు పెరిగే అవకాశం ఉంది. ఇలా అన్ని మండలాల్లో ఉన్న భూముల మార్కెట్ ధరలు ప్రభుత్వ లెక్కల ప్రకారం పెరగనున్నాయి.అయితే ప్రాంతాన్ని బట్టి ఈ భూముల మార్కెట్ ధరలు మారుతాయి.
పెరగనున్న రిజిస్ట్రేషన్ చార్జీలు..
ప్రస్తుతం భూముల రిజిస్ట్రేషన్‌కు భూమి ధరలో 7.5 శాతం వసూలు చేస్తున్నారు. ఉదాహరణకు భూమి ధర రూ.1 లక్ష ఉంటే 7.5 శాతం రిజిస్ట్రేషన్ అంటే రూ.7,500లు చెల్లించాలి. ఫిబ్రవరి 1 నుంచి 20 శాతం భూమి ధర పెరుగుతుంది.అంటే మార్కెట్ ధర రూ.1.20 లక్షలు అవుతుంది. దీనికి 7.5 శాత రిజిస్ట్రేషన్ చార్జీలు అంటే రూ.9వేలు చెల్లించాలి. అదనంగా మరో రూ.1500 రిజిస్ట్రేషన్ చార్జీ భారం ప్రజలపై పడనుంది.భూముల ధరలు పెంచేసి రిజిస్ట్రేషన్ ఫీజుల భారం ప్రజలపై మోపేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.
సవరణ పనులిలా..
భూముల మార్కెట్ ధరలు పెంచేందుకు ఈ నెల 23న మార్కెట్ విలువల సవరణ నమూనాను నోటీసు బోర్డులో ప్రదర్శించారు.ఈనెల 24న సంబఽంధిత కమిటీల ద్వారా తాత్కాలిక అనుమతులు, 25న వెబ్‌సైట్‌లో డేటా ప్రదర్శించారు. ఈనెల 27 వరకు ప్రజల నుంచి అభ్యంతరాలు,సూచనలు కోరడం, 29న డేటా ఎంట్రీ పూర్తి, చెక్ లిస్ట్ జనరేషన్, ఫారం–1, 4 పరిశీలన, 30న అభ్యంతరాల పరిష్కారం, 31న మార్కెట్ విలువల సవరణ కమిటీల ద్వారా తుది అనుమతులు, పిబ్రవరి 1న పెరిగిన విలువ అమల్లోకి తీసుకురానున్నట్లు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం పేర్కొంది.
ప్రణాళిక సిధ్ధం
భూముల మార్కెట్ విలువలను సవరించి వచ్చే నెల 1 నుంచి అమలు చేస్తారు. దీనిపై ఇప్పటికే సవరణకు సంబంధించి ప్రక్రియ చేపట్టాం.మా కార్యాలయం పరిధిలోని మండలాలు, గ్రామాలు, రుడా పరిధిలో ఉన్న దృష్ట్యా అక్కడ కూడా భూముల మార్కెట్ విలువ పెరుగుతుంది. దీన్ని ప్రతి ఒక్కరు గమనించాలి.దీనికి సంబంధించిన ప్రణాళిక సిధ్ధం చేశాం.
కె.శ్రీరామమూర్తి, సబ్ రిజిస్ట్రార్, పాలకొండ
మార్కెట్ భూమ్


