వారానికి ఐదు పని దినాలు అమలు చేయాలి
● బ్యాంకు ఉద్యోగుల డిమాండ్
● జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ
విజయనగరం అర్బన్: ఇండియన్ బ్యాంకింగ్ పరిశ్రమలో వారానికి ఐదు పనిదినాల విధానాన్ని అమలు చేయాలని, ప్రస్తుతం బ్యాంకులకు సెలవులుగా ఉన్న రెండవ, నాల్గవ శనివారాలతో పాటు అన్ని శనివారాలను సెలవులుగా ప్రకటించేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని బ్యాంకు ఉద్యోగులు డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా మంగళవారం చేపట్టిన ఒకరోజు సమ్మెలో భాగంగా జిల్లాలోని 400కు పైగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల సిబ్బంది పట్టణంలోని కోట వద్ద ఎస్‌బీఐ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం కోట జంక్షన్ నుంచి మూడులాంతర్ల కూడలి, గంటస్తంభం జంక్షన్ మీదుగా ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచ్ కూడలి వరకు భారీ ల్యారీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ (ఐబీఏ) సిఫార్సుల ఆధారంగా ఐబీఏ–యూఎఫ్‌బీయూ మధ్య 2023 డిసెంబర్ 2న కుదిరిన అవగాహన ఒప్పందం, 2024 మార్చి 8న కుదిరిన సెటిల్మెంట్/జాయింట్ నోట్ ప్రకారం ఈ డిమాండ్ అమలు చేయాల్సి ఉందన్నారు. ఇప్పటికే ఆర్‌బీఐ, సెబీ, ఎల్‌ఐసీ, ఐఆర్‌డీఏ తో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో వారానికి ఐదు పని దినాల విధానం అమలులో ఉందని అదే విధానాన్ని బ్యాంకింగ్ రంగంలో కూడా అమలు చేయాలని కోరారు.
స్తంభించిన రూ.500కోట్ల లావాదేవీలు
సమ్మె కారణంగా జిల్లా వ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలు స్తంభించాయి. జిల్లాలోని 400కు పైగా ఉన్న పబ్లిక్, ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్‌ల కార్యాలయాలలో దాదాపు 3 వేల మంది ఉద్యోగులు విధులు నిర్వహించకపోవడం వల్ల దాదాపు రూ.500 కోట్ల లావాదేవీలు జరగలేదని ఆయా బ్యాంకింగ్ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో యూఎఫ్‌బీఐ కన్వీనర్ మురళీశ్రీనివాస్, ప్రాంతీయ కార్యదర్శి (ఎస్‌బీఐఎస్‌యూఏసీ, ఎన్‌సీబీఈ) ఎం.రమేష్‌కుమార్, జిల్లా బ్యాంక్స్ కో ఆర్డినేషన్ కమిటీ ప్రతినిధి బి.ప్రసాద్, ఎస్‌బీఐఓఏ విజయనగరం రీజియన్‌కు చెందిన డి.మృదుల, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ పెన్షన్ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ అరసాడ వెంకటరావు, జాయింట్ సెక్రటరీ కొండపల్లి సురేష్, యూవీమురళీవెంకట కృష్ణ, కొప్పిలి వెంకట శ్రీనివాసరావుతోపాటు వివిధ బ్యాంక్‌ల సిబ్బంది ఐవీరమణమూర్తి, శ్రావణ్, భానోజీ, చంద్రశేఖర్, సంతోష్, బ్యాంక్ రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు.


