పండగపూట కందిపప్పు కరువే..!
● ఏడాదిగా కందిపప్పు పంపిణీ నిలిపివేత
● జిల్లాలో రైస్ కార్డుదారులు 5.71 లక్షలు
● కందిపప్పు నిలిపివేసి ఏడాదికి రూ.82 కోట్ల భారం తగ్గించుకున్న ప్రభుత్వం
● అప్పట్లో కేజీ రూ.67కే...
● ఇదీ పరిస్థితి...
విజయనగరం ఫోర్ట్:
‘పండగపూట కూడా పప్పుకూడు కరువే’ అన్న చందంగా ఉంది చంద్రబాబు పాలన తీరు. అధికారంలోకి వస్తే రేషన్‌దుకాణాల నుంచి అన్ని రకాల సరుకులు సరఫరా చేస్తామని గొప్పలు చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చాక ప్లేటు ఫిరాయించారు. ఎక్కువ సరుకులు మాట దేవుడెరుగు.. ఉన్న సరుకులకే చంద్రబాబు సర్కారు మంగళం పాడేసింది. పేదలకు పండగపూట కూడా కందిపప్పు సరఫరా చేయకపోవడంపై పేదవర్గాలు ఆవేదన చెందుతున్నాయి. ప్రభుత్వం తీరును దుమ్మెత్తిపోస్తున్నాయి.
జిల్లాలో రైస్‌కార్డుదారులు 5.71 లక్షల మంది ఉన్నారు. గతంలో కార్డుదారులకు ప్రతినెలా కేజీ చొప్పున కందిపప్పు సరఫరా చేసేవారు. ఈ లెక్కన నెలకు 571 మెట్రిక్‌టన్నుల కందిపప్పు సరఫరా చేయాల్సి ఉంది. నెలకు రూ.6.82 కోట్ల వరకు వ్యయం అవుతుంది. కందిపప్పు సరఫరా నిలిపివేయడం వల్ల ఏడాదికి రూ.82 కోట్ల వరకు చంద్రబాబు సర్కార్ భారం తగ్గించుకుంది. పేదలకు పప్పురుచిని దూరం చేసింది.
రేషన్ షాపులు ద్వారా కార్డు కలిగిన ప్రతి లబ్ధిదారుడికి కేజీ రూ.67 చొప్పున అందించేవారు. మార్కెట్‌లో కేజీ కందిపప్పు రూ.110 నుంచి రూ.120 మధ్యన ఉంది. తక్కువ ధరకే రేషన్ షాపుల్లో కందిపప్పు దొరకడంతో కార్డుదారులు కందిపప్పు తీసుకునేవారు. సంక్రాంతి పండగకు అయినా చంద్రబాబు ప్రభుత్వం కందిపప్పు సరఫరా చేస్తుందని లబ్ధిదారులు భావించారు. పండగకు పప్పు సరఫరా చేయకపోవడంతో నిరాశ చెందుతున్నారు.


