సేవల్లో సైనికుడు
● పేద విద్యార్థులకు చేయూత
● అనాథ పిల్లలకు ఆర్థిక సహాయం
● యువతకు ఆర్మీ శిక్షణ
గుర్ల: ఆయన దేశ సేవలో 22 ఏళ్లు తరించారు. ఉద్యోగం నుంచి స్వచ్ఛంద విరమణ చేసి గ్రామ, పేదల సేవలో తరిస్తున్నారు. విద్యార్థులు, యువత భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారు. అందరితోనూ శభాష్ సైనికా అనిపించుకుంటున్నారు. ఆయనే.. కెల్ల గ్రామానికి చెందిన మాజీ సైనికోద్యోగి సారిక అప్పారావు. 2024లో ఉద్యోగవిరమణ పొందిన నుంచి పుట్టిన ఊరుకు, చదివిన పాఠశాలకు, పేద విద్యార్థులకు సేవచేస్తున్నారు. విద్యార్థులకు మౌలిక వసతులు కల్పిస్తున్నారు.
ఆయన చేసిన సేవల్లో కొన్ని..
● దూర ప్రాంతాల నుంచి కెల్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు వస్తున్న పేద విద్యార్థులకు సైకిళ్లు అందజేశారు. నోట్ పుస్తకాలు, అభ్యసన సామగ్రి సమకూర్చారు.
● పాఠశాలలో స్వచ్ఛమైన తాగునీటికోసం మరమ్మతులకు గురైన మినరల్ ఫ్యూరిపికేషన్ మిషన్‌ను సొంత డబ్బులతో బాగుచేయించారు.
● కెల్ల గ్రామానికి చెందిన బిర్లంగి రాంబాబు మృతి చెందడంతో వారిద్దరు బాలికలకు రూ.25 వేలు చొప్పున ఆర్థిక సహాయం అందించారు.
● పాఠశాలలోని మరుగుదొడ్లకు సొంత డబ్బు లతో రన్నింగ్ వాటర్ సదుపాయం కల్పించారు.
● గుర్ల, కెల్ల గ్రంథాలయాల్లో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారికి అవసరమైన పుస్తకాలు సమకూర్చుతున్నారు.
● కెల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెల్లవారు జామున యువతకు ఆర్మీ శిక్షణ ఇస్తున్నారు. రక్షణ దళాల్లో ఉద్యోగం సాధించేందుకు అనువుగా మెలకువలను నేర్పుతూ ఫిజికల్‌గా సిద్ధం చేస్తున్నారు. ఆయన వద్ద శిక్షణ పొందిన కెల్ల గ్రామానికి చెందిన ఆరుగురు యువకులు ఇటీవల అగ్నివీర్‌కు ఎంపికయ్యారు.
ఉన్నంతలో సాయం..
ప్రజలకు సేవ చేయడంలో పూర్తి సంతృప్తి చెందుతున్నాను. విద్యార్థులు, అనాథబాలికలకు ఆర్థిక సాయం చేస్తున్నా. పుట్టిన ఊరు, చదువుకున్న పాఠశాల రుణం తీర్చుకునేందుకు కృషి చేస్తాను. విద్యార్థులను ఉన్నత స్థాయిలో చూడాలన్నదే ఆకాంక్ష.
– సారిక అప్పారావు, మాజీ సైనికుడు, కెల్ల
సేవల్లో సైనికుడు
సేవల్లో సైనికుడు


