
రూ.1.80 కోట్లతో పైడితల్లి ఆలయ పునర్నిర్మాణం
● వచ్చే ఏడాది పండగలోపు పనులు
పూర్తి చేస్తాం..
● ఆలయ అనువంశిక ధర్మకర్త
అశోక్‌గజపతిరాజు
విజయనగరం టౌన్:
ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ పనులకు ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు గురువారం శంకుస్థాపన చేశారు. కుటుంబ సమేతంగా పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారిణి కె.శిరీష ఆలయ సంప్రదాయం ప్రకారం అధికారిక లాంఛనాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోటీ 80 లక్షల రూపాయల సీడీఎఫ్ నిధులతో చేపట్టనున్న పునర్నిర్మాణ పనులను ఏడాదిలోపు పూర్తి చేస్తామన్నారు. వచ్చే ఏడాది పండగ నాటికి భక్తులకు ఇబ్బందులు తొలిగిపోతాయన్నారు. వారు సంతోషించేలా పనులను పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు. అభివృద్ధి పనులను ప్రారంభించడం తమ అదృష్టంగా పేర్కొన్నారు. పైడితల్లి అమ్మవారి కీర్తిని, ప్రతిష్టను మరింత పెంచేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు మాట్లాడుతూ చట్ట ప్రకారం ఆలయ భూసేకరణ పూర్తయ్యిందన్నారు. దీంతో ఆలయ పునర్నిర్మాణ పనులకు అవకాశం కలిగిందని, పనులను వేగంగా నిర్వహించి ఏడాదిలోపే పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఆలయ విస్తరణ వలన అన్ని సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు, ఆలయ ఈవో కె.శిరీష, సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, పలువురు భక్తులు పాల్గొన్నారు.