
కాలం చెల్లిన కందిపప్పు
రామభద్రపురం: అంగన్‌వాడీ కేంద్రాల్లో చదువుతున్న పిల్లలకు ఆరోగ్యం, పౌష్టికాహారం, భద్రత కల్పించే లక్ష్యంతో అంగన్‌వాడీ కేంద్రాలు పనిచేయాలి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించడం లేదు. నాణ్యమైన పౌష్టికాహారం అందజేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. పురుగులు పట్టిన, నాసిరకానిదే కాకుండా కాలం చెల్లిన కందిపప్పును గర్భిణులు, బాలింతలకు సరఫరా చేస్తున్నారు. అలాగే ఈ కాలం చెల్లిన కందిపప్పునే అంగన్వాడీ సెంటర్లలోని చిన్నారులకు వండిపెడుతున్నారు. ఇందుకు నిదర్శనం ఈ నెల 9వ తేదీన ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయప్రతాప్‌రెడ్డి రామభద్రపురం మండలకేంద్రంలోని అంగన్‌వాడీ సెంటర్–5ను అకస్మికంగా తనిఖీ చేసి 8 ప్యాకెట్లు కాలం చెల్లిన కందిపప్పు ఉన్నట్లు గుర్తించి కంగుతిన్నారు. ఇలాంటి కందిపప్పు తిన్న చిన్నారులు, గర్భిణులు, బాలింతలు ఏదైనా అనారోగ్యం బారిన పడితే ఎవరు బాధ్యత వహిస్తారని ఐసీడీఎస్ అధికారులపై ఆగ్రహంతో పాటు ఆవేదన వ్యక్తం చేశారు.
జిల్లావ్యాప్తంగా 11 ఐసీడీఎస్ ప్రాజెక్టులుండగా వాటి పరిధిలో మెయిన్, మినీ మొత్తం కలిపి 2499 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాలకు సివిల్ సప్లయిస్ గోదాముల నుంచి రేషన్ డీలర్లకు, వారి నుంచి అంగన్వాడీ సెటర్లకు సరుకులు సరఫరా చేస్తారు. అయితే సరుకు తయారైన మూడు నెలలకు గోదాంకు చేరుతుందని అధికార సమాచారం. గోదాముకు చేరిన సరుకును ఈ కందిపప్పులో పురుగులు ఉన్నాయో? లేక నాసిరకంగా ఉందో సంబంధిత అధికారులు కనీసం పరిశీలించకుండా వచ్చిన సరుకు వచ్చినట్లు గానే ఒక నెల తర్వాత రేషన్ డీలర్ల ద్వారా అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్నారు. అయితే తయారైన కందిపప్పు అక్కడే సుమారు మూడు నెలల తర్వాత కేంద్రాలకు చేరుతుంది.ఆ పప్పు కాలపరిమితి ఆరు నెలలు. సెంటర్లలో టీచర్లు నిర్లక్ష్యంగా పక్కన పడేస్తూ ఆ పప్పునే కేంద్రాలకు వచ్చిన చిన్నారులకు వండి పెట్టడంతో పాటు గర్భిణులు, బాలింతలకు పంపిణీ చేస్తున్నారు. అయితే గడువు ఉండగానే పంపిణీ చేస్తున్నామని గోదాము అధికారులు చెబుతుండగా, తక్కువ కాలం ఉన్న కందిపప్పు ప్యాకెట్లు సరఫరా అవుతున్నాయని అంగన్‌వాడీ టీచర్లు చెబుతున్నారు. ఓ వైపు ప్రభుత్వం శ్రద్ధ వహించకపోవడం, మరో వైపు అధికారుల పర్యవేక్షణ లోపంతో ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని పలువురు మండిపడుతున్నారు.
పర్యవేక్షణ కరువు..
జిల్లా ఉన్నతాధికారుల గోదాముల పర్యవేణలేకపోవడంతో సరుకుల సరఫరా దారులు ఇష్టారాజ్యం వ్యవహరిస్తున్నారని,అంగన్‌వాడీ కేంద్రాలను పర్యవేక్షించిన సీ్త్ర సంక్షేమాధికారులు కూడా తూతూ మంత్రంగా తనిఖీలు చేస్తున్నారని పలువురు గర్భిణులు, బాలింతలు, చిన్నారుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అకస్మిక తనిఖీలో గుర్తించిన ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్
అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారుల ఆరోగ్యంతో చెలగాటం
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న గర్భిణులు, బాలింతలు
కాల పరిమితి ఉన్న కందిపప్పు సరఫరా
మా గోదాముకు మార్చి నెలలో వచ్చిన కందిపప్పును రామభద్రపురం అంగన్‌వాడీ కేంద్రం–5కు డీలర్ ద్వారా జూలై నెలలో పంపిణీ చేశాం. ఆ పప్పు ఆగస్టు నెలతో కాలం చెల్లుతుంది. అయితే ఆ పప్పు ఇప్పటి వరకు పంపిణీ చేయకుండా వదిలేయడం అంగన్‌వాడీ నిర్వాహకుల తప్పిదం. కాట్రాక్టర్ నుంచి నేరుగా గోదాంకు కందిపప్పు ప్యాకెట్లుతో ఉన్న బస్తాలు చేరుతాయి. వాటిని అంగన్‌వాడీ కేంద్రాలకు పంపిస్తాం.
సూర్యప్రకాష్, గోదాం ఇన్‌చార్జి, బొబ్బిలి
సూపర్‌వైజర్, టీచర్‌కు మెమోలు
రామభద్రపురం అంగన్‌వాడీ సెంటర్–5లో ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయప్రతాప్‌రెడ్డి 8 కాలం చెల్లిన కందిపప్పు ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించారు. ఐసీడీఎస్ ఆదేశాల మేరకు సంబంధిత సూపర్‌వైజర్‌తో పాటు టీచర్‌కు మెమోలు జారీ చేస్తున్నాం.
ఎం.వరహాలమ్మ, సీడీపీవో బాడంగి

కాలం చెల్లిన కందిపప్పు