
చేపల దొంగలపై చర్యలు తీసుకోవాలి
● జిల్లా మత్య్సకార సహకార సంఘం
అధ్యక్షుడు బర్రి చిన్నప్పన్న
గంట్యాడ: మండలంలోని పెంట శ్రీరాంపురం గ్రామంలోని నల్ల చెరువులో దొంగతనంగా చేపలు పట్టిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని జిల్లా మత్య్సకార సహకార సంఘం అధ్యక్షుడు బర్రి చిన్నప్పన్న డిమాండ్ చేశారు. పెంట శ్రీరాం పురం గ్రామంలో అక్కివరం, గొడ్డు పాలెం గ్రామాలకు చెందిన నలుగురు వ్యక్తులు చేపలు పడుతుండగా గ్రామానికి చెందిన మత్య్సకార సహకార సంఘం సభ్యులు పట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. దొంగతనంగా చేపలు పట్టిన వారిపై కేసు నమోదు చేయడంలో పోలీసులు జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. తక్షణమే వారిపై కేసులు నమోదు చేయాలని లేని ఎడల మత్య్సకార సహకార సంఘాల నాయకులం రోడ్డెక్కి ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. చెరువుల్లో దొంగతనంగా చేపలు పడుతున్న విషయంపై గత నెలలో కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేశామని తెలిపారు. అయినప్పటికీ సరైన చర్యలు తీసుకోక పోవడం వల్ల మత్య్సకారులకు చెందిన చేపలు చోరీకి గురై ఆర్థికంగా నష్ట పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.