
డీఎస్‌డీఓగా వెంకటేశ్వరరావు
● శ్రీధర్‌రావుకు పార్వతీపురం మన్యం జిల్లాకు బదిలీ
విజయనగరం: జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి (డీఎస్‌డీఓ)గా ఎస్.వెంకటేశ్వరరావు నియమితులయ్యారు. విశాఖ జిల్లా అధికారిగా విధులు నిర్వహిస్తున్న ఆయనను విజయనగరం జిల్లాకు బదిలీ చేస్తూ శాప్ ఎం.డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు జిల్లాలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించిన కె.శ్రీధర్‌రావును పార్వతీపురం మన్యం జిల్లాకు చేస్తూ బదిలీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అదేవిధంగా విజయనగరం జిల్లా హాకీ కోచ్‌గా విధులు నిర్వహిస్తున్న ఎ.మహేష్‌బాబుకు శ్రీకాకుళం జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారిగా బాధ్యతలు అప్పగించారు. తాజా బదిలీ ఉత్తర్వుల మేరకు సంబంధిత అధికారులు వెనువెంటనే బాధ్యతలు స్వీకరించాలని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారిగా నియామకమైన వెంకటేశ్వరరావుకు గతంలో జిల్లాలో పని చేసిన అనుభవం ఉంది.
ఇసుక అక్రమ తరలింపు అడ్డగింత
బొబ్బిలి రూరల్: మండలంలోని అలజంగి గ్రామం వద్ద వేగావతి నదిలో అక్రమంగా ఇసుకను తవ్వి తరలించేందుకు సిద్ధం చేసిన ట్రాక్టర్లను తహసీల్దార్ ఎం.శ్రీను శనివారం పట్టుకున్నారు. రెవెన్యూ, పోలీసులతో కలిసి ట్రాక్టర్లను తహసీల్దార్ కార్యాలయం వద్దకు తరలించారు. శని,ఆదివారాలు సెలవు దినాలు కావడంతో అధికారులెవరూ విధుల్లో ఉండరని భావించిన ట్రాక్టర్ యజమానులు శనివారం ఉదయం ఆరు గంటలకే ఇసుక తవ్వకాలకు జేసీబీనీ సిద్ధం చేసుకుని వరుస క్రమంలో జేసీబీతో నదిలో ఇసుకను తోడుతున్నారు. గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు తహసీల్దార్ రెవెన్యూ, పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేయడంతో దాడిచేసే సమయానికి జేసీబీ, కొన్ని ట్రాక్టర్లు తప్పించుకోగా ఇసుకను లోడు చేసేందుకు సిధ్దంగా ఉన్న ఏడు ఖాళీ ట్రాక్టర్లను తహసీల్దార్ అదుపులోకి తీసుకున్నారు. యజమానులను పిలిపించి హెచ్చరించారు. ట్రాక్టర్ల నంబర్లు తీసుకుని అక్రమ ఇసుక రవాణాతో దొరికితే తీవ్రపరిణామాలుంటాయని హెచ్చరించి విడిచిపెట్టారు. ట్రాక్టర్ యజమానుల సంఘం ప్రతినిధులతో మాట్లాడుతూ ఇది చివరి అవకాశమని మరో మారు దొరికితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

డీఎస్‌డీఓగా వెంకటేశ్వరరావు