
యువతి ఆత్మహత్య
విజయనగరం క్రైమ్: విజయనగరంలోని అయ్యకోనేరు చెరువులో శనివారం సాయంత్రం 6.30 గంటలకు టూటౌన్ పోలీసులు ఓ యువతి మృతదేహాన్ని గుర్తించారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నగరంలోని బాబామెట్టకు చెందిన బెహరా ఈశ్వరరావు దంపతులకు ఇద్దరు పిల్లలు.
కొడుకు హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తుండగా, కూతురు రమ్య స్థానికంగా చదువుతోంది. ఈశ్వరరావు భార్య నగరంలోని మహరాణిపేటలో బీవీకే స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తోంది. శుక్రవారం సాయంత్రం ఇంటి నుంచి సైకిల్‌పై వెళ్లిన రమ్య మరుసటి రోజు వరకు ఇంటికి రాలేదు. ఫోన్ చేస్తే అందుబాటులో లేదని వచ్చింది.
దీంతో శనివారం ఉదయం తండ్రి బెహరా ఈశ్వరరావు టుటౌన్ పోలీసు స్టేషన్‌కు వచ్చి తన కూతురు కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. సాయంత్రం అయ్యేసరికి అయ్యకోనేరు చెరువులో మృతదేహం కనిపించింది. ఇంటి నుంచి వెళ్లి పోయిన రమ్యకు పెళ్లి చేసేందుకు కన్నవారు యత్నించారు. అయితే తనకు ఆ పెళ్లి ఇష్టంలేదని గడిచిన కొద్దిరోజుల నుంచి కన్నవారితో రమ్య గొడవపడుతూనే ఉంది.
దీంతో ఎవరితో మాట్లాడకుండా ఉండడం, గదిలోకి వెళ్లి ఒంటరిగా ఉండడం వంటి పనులు చేయసాగింది. శుక్రవారం ఫ్రెండ్ దగ్గరకు వెళ్తానని చెప్పి సైకిల్ తీసుకుని వెళ్లి చివరకు తిరిగి రాని లోకాలకు వెళ్లి కన్నవారికి తీరని శోకాన్ని మిగిల్చింది. తొలుత మిస్సింగ్ కేసు నమోదు చేసినా మృతదేహం లభించడంతో బీఎన్‌ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశామని సీఐ శ్రీనివాసరావు తెలిపారు.