
చీపురుపల్లిలో భారీ చోరీ
● 10 తులాల బంగారం, కేజీన్నర వెండి, రూ.2.5 లక్షలు నగదు అపహరణ
● బాధితుడి ఫిర్యాదుపై పోలీసుల దర్యాప్తు
చీపురుపల్లి: పట్టణంలో జరుగుతున్న వరుస దొంగతనాలు అలజడి సృష్టిస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని స్థానికులు భయాందోళన చెందాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మెయిన్‌రోడ్‌లో ఇద్దరు వృద్ధులను గాయపరిచి భారీ మొత్తంలో బంగారం దోచుకెళ్లిన ఘటన జరిగిన కొద్ది రోజుల్లోనే పట్టణంలోని ఆంజనేయపురంలోని విజయకృష్ణ అపార్ట్‌మెంట్ రోడ్‌లో నివాసం ఉంటున్న ఒమ్మి సురేష్ అనే ఉపాధ్యాయుడి ఇంటిలో శుక్రవారం రాత్రి భారీ చోరీ జరగడం స్థానికంగా ఉలిక్కపడేలా చేసింది. ఈ ఘటనలో 10 తులాల బంగారం, కేజీన్నర వెండి, రూ.2.5 లక్షలు నగదు పోయినట్లు ఉపాధ్యాయుడు సురేష్ తెలిపారు. దొంగలు ఇంటిలోని రెండు బెడ్ రూమ్‌లలో ఉన్న బీరువాలు, కప్‌బోర్డులు మొత్తం వెతికి, సామగ్రి చిందర వందరగా పడేశారు. బీరువాల్లో చీరలు, బట్టలు ఉన్నప్పటికీ వాటిని ముట్టుకోకుండా బంగారం, వెండి, నగదుపైనే దుండగులు దృష్టి సారించారు. ఇదే ఇంటికి పక్కనే ఉన్న విజయకృష్ణ అపార్ట్‌మెంట్‌లో రెండేళ్ల క్రితం గంగాధర్ నివాసంలో పడిన దొంగలు 25 తులాల బంగారం అపహరించుకుపోయారు. మళ్లీ అక్కడే పక్క ఇంటిలో చోరీ జరగడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
కిటికీ గ్రిల్ తొలగించి ఇంట్లోకి ప్రవేశించి
కిటికి గ్రిల్ తొలగించి ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు పొడవాటి స్క్రూడ్రైవర్, మూడు అడుగుల రాడ్డుతో ఇంట్లో ఉన్న బీరువాలను తెరిచారు. బీరువాల్లో లాకర్లు తెరిచి 10 తులాల బంగారం, కేజీన్నర వెండి, రూ.2.5 లక్షలు నగదు దోచుకెళ్లారు. అయితే చోరీకి తీసుకొచ్చిన స్క్రూ డ్రైవర్, రాడ్డు బెడ్ రూమ్‌లోని మంచంపైనే వదిలి పెట్టి వెళ్లిపోయారు.
పెళ్లికి వెళ్లి వచ్చిన బాధితులు
ఉపాధ్యాయుడు సురేష్ భార్యతో కలిసి శుక్రవారం మధ్యాహ్నం రాజాం పట్టణానికి ఓ వివాహ వేడుకకు వెళ్లారు. వేడుక ముగించుకుని తిరిగి రాత్రి 1.30గంటల సమయంలో ఇంటికి చేరుకున్నారు. ఇంటి ముఖద్వారం తాళం తెరిచి లోపలికి వెళ్లి ప్రధాన హాలు తలుపు తీసేందుకు ప్రయత్నించగా రావడం లేదు. లోపల గడియ పెట్టి ఉండడాన్ని గమనించి ఇంట్లో దొంగలు పడినట్లు గుర్తించారు. తెలిసిన వారికి ఫోన్‌లు చేసి రప్పించి పోలీసులకు సమాచారం ఇస్తున్న సమయంలో ఇంటి లోపల ఉన్న దొంగలు వెనుక డోర్ నుంచి పారిపోయారు.
ఆధారాల సేకరణ
విషయం తెలుసుకున్న క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించాయి. చోరీకి వినియోగించిన పరికరాలు, కిటికీ గ్రిల్‌పై వేలిముద్రలు సేకరించారు. బాధితుడు సురేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

చీపురుపల్లిలో భారీ చోరీ

చీపురుపల్లిలో భారీ చోరీ