చిన్నా... లే నాన్నా.. | - | Sakshi
Sakshi News home page

చిన్నా... లే నాన్నా..

Oct 11 2025 5:44 AM | Updated on Oct 11 2025 5:44 AM

చిన్న

చిన్నా... లే నాన్నా..

ఆడుకునేందుకు వెళ్లి అనంత లోకాలకు..

విద్యుదాఘాతంతో బాలుడి మృతి

కన్నీరుపెట్టిన తల్లిదండ్రులు

పంచాయతీ, విద్యుత్‌శాఖ నిర్లక్ష్యానికి బాలుడు

బలయ్యాడంటూ బంధువుల ఆరోపణ

శోకసంద్రంలో ఎస్‌.పెద్దవలస ఎస్సీ కాలనీ

మక్కువ: చిన్నా.. లే నాన్నా... ఆడుకుని వస్తానని చెప్పి అనంత లోకాలకు వెళ్లిపోయావా... అప్పుడే నూరేళ్లు నిండిపోయాయా.. మాతో ఎవరు ఆడుకుంటారు... వేగంగా వచ్చేస్తానన్నావు... మమ్మల్ని విడిచిపెట్టి వెళ్లిపోయావా అంటూ చిన్నారి తల్లిదండ్రులు రోదించిన తీరు అక్కడివారిని కన్నీరుపెట్టించింది. అన్నం పెట్టమ్మా.. తిని కాసేపు ఆడుకొని వచ్చేస్తానంటూ బయటకు వెళ్లిన చిన్నారి విద్యుదాఘాతంతో మృతిచెందడం కుటుంబ సభ్యులు, గ్రామస్తుల్లో విషాదం నింపింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...

మక్కువ మండలం ఎస్‌.పెద్దవలస ఎస్సీ కాలనీకు చెందిన కల్లుకోట రమ్య, చందుల కుమారుడు అఖీరా(4) శుక్రవారం ఉదయం ఆడుకునేందుకు మరో స్నేహితుడితో కలిసి వెళ్లాడు. రెండు గంటల సమయం దాటినా ఇంటికి చేరుకోకపోవడంతో తల్లి రమ్య వెతకసాగింది. అఖీరాతో ఆడుకునేందుకు వెళ్లిన మరో బాలుడిని బిడ్డ ఆచూకీ కోసం ఆరా తీసింది. పాఠశాల వైపు వెళ్లాడని ఆ బాలుడు సమాధానం చెప్పడంతో అటువైపుగా వెళ్లిన ఆ తల్లి పాఠశాల ప్రహరీ పక్కన అపస్మారక స్థితిలో పడి ఉన్న బిడ్డను చూసి తల్లడిల్లిపోయింది. కేకలు వేస్తూ బిడ్డను హత్తుకునే ప్రయత్నంలో ఆమెకు కూడా విద్యుత్‌షాక్‌ తగలడంతో కాలనీ వాసులు రక్షించారు. లేదంటే తల్లి కూడా బిడ్డతో పాటు మృతిచెందేది. కాలనీకి తాగునీరు సరఫరా చేసే రక్షిత మంచినీటి పథకం విద్యుత్‌ ప్యానల్‌బోర్డును పాఠశాల ప్రహరీకి అమర్చారు. దాని పక్కనే జామిచెట్టు ఉంది. చెట్టుకాయలు తెంపేందుకు చిన్నారి వెళ్లాడా? లేదంటే అక్కడ ఆడుకుంటుండగా విద్యుత్‌షాక్‌ తగిలిందో తెలియదు.. విగతజీవిగా కనిపించాడు. కొడుకు మృతిచెందిన విషయం తెలుసుకున్న తండ్రి చందు విశాఖపట్టణం నుంచి హుటాహుటిన చేరుకున్నాడు. నాన్న, చిన్నా లేవరా.. నాతో ఎవరు ఆడుకుంటారు.. లే..నాన్న అంటూ తండ్రి రోదన అందరి కంట కన్నీరు తెప్పించింది. పోస్టుమార్టం కోసం ఆటోలో తరలిస్తున్న బాలుడిని పట్టుకొని ఆ తండ్రి కన్నీరుమున్నీరయ్యారు.

బాలుడి మృతదేహం వద్ద కన్నీరుపెడుతున్న

తల్లిదండ్రులు, బంధువులు

గ్రామంలో ఎస్సీ కాలనీకు తాగునీరు అందించేందుకు మినీ రక్షిత మంచినీటి పథకం ఏర్పాటుచేశారు. తాగునీరు సరఫరా చేసేందుకు పాఠశాల ప్రహరీకి అమర్చిన ప్యానల్‌ బోర్డు కింద వైరు పాడవ్వడంతో ప్యానల్‌ బోర్డుకు విద్యుత్‌ సరఫరా అవుతోంది. కాలనీ వాసులు నిత్యం కర్రలతో స్విచ్‌ ఆన్‌, ఆఫ్‌ చేసి తాగునీరు పట్టుకుంటున్నారు. ఈ విషయం పలుమార్లు పంచాయతీ అధికారులకు తెలియజేసినా పట్టించుకోకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. బాలుడు అఖీరా విద్యుత్‌ షాక్‌తో మృతి చెందిన విషయం తెలుసుకున్న విద్యుత్‌ శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని విద్యుత్‌ స్తంభంపై ఉన్న వైరును తొలగించి, వారిపై ఎటువంటి అపనింద పడకుండా చేసిన ప్రయత్నాలను కాలనీ వాసులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, ప్రమదానికి గల కారణాలు తెలుసుకున్నారు. కేసు నమోదుచేసి, బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సాలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

పంచాయతీ, విద్యుత్‌శాఖ అధికారుల నిర్లక్ష్యానికి బాలుడు బలి?

చిన్నా... లే నాన్నా.. 1
1/2

చిన్నా... లే నాన్నా..

చిన్నా... లే నాన్నా.. 2
2/2

చిన్నా... లే నాన్నా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement