
ఉపాధ్యాయురాలి ఆత్మహత్య
నెల్లిమర్ల రూరల్: అనారోగ్యంతో బాధపడుతున్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆత్మహత్యకు పాల్పడింది. నెల్లిమర్ల మండలంలోని మొయిద గ్రామంలో గురువారం సాయంత్రం జరిగిన ఈ ఘటనపై ఎస్సై గణేష్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కవల కనకలక్ష్మి (42) గుర్ల మండలంలోని పెనుబర్తి ప్రభుత్వ పాఠశాలలో ప్రస్తుతం ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వర్తిస్తున్నారు. సుమారు పదేళ్ల నుంచి పక్షవాతం సమస్యతో ఆమె బాధపడుతున్న నేపథ్యంలో మనస్తాపానికి గురై గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. బయటకు పొగలు రావడంతో గమనించిన స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూడగా కుర్చీలో అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను గమనించి 108కు సమాచారం అందించారు. తీవ్ర గాయాలపాలైన ఆమెను విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. మృతురాలి భర్త నక్కిన శ్రీనివాసరావు కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగానే పనిచేస్తున్నారు. వారికి ఒక కుమార్తె ఉంది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై గణేష్ శుక్రవారం తెలిపారు.