
గురుకుల విద్యార్థులు
పచ్చకామెర్ల గుప్పిట్లో
● పదుల సంఖ్యలో పిల్లలకు జ్వరాలు
● పాఠశాలలకు ఇంకా సెలవులు
● తల్లిదండ్రులకు సైతం వైద్య పరీక్షలు
● మన్యంలో కిక్కిరిసిపోతున్న ఆస్పత్రులు
సాక్షి ప్రతినిధి, విజయనగరం:
పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాం గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాలలో విషజ్వరాలు, పచ్చకామెర్లు వచ్చి పిల్లల ప్రాణాలు హరిస్తున్న ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయింది. దాదాపు 611 మంది బాలికలు చదువుతున్న గురుకుల విద్యాసంస్థలో ఆగస్టు నెలలోనే వ్యాధి వెలుగు చూసినా అధికారులు, హాస్టల్ నిర్వాహకులు పెద్దగా పట్టించుకోకపోగా.. ఇది సహజమే... తగ్గిపోతుందిలే అనే ఉదాసీనతతో మెనూ నుంచి చికెన్ మాత్రం పెట్టడం మానేసి ఊరుకున్నారు. దీంతో ఆ వ్యాధి అలా ఒక్కొక్కరిగా వ్యాప్తిస్తూ ఇప్పుడు పదుల సంఖ్యలో విద్యార్థులు దాని గుప్పెట్లో చిక్కుకున్నారు.
● అప్పుడే స్పందిస్తే... ఇంత జరిగేదా..?
గురుకుల పాఠశాలలో ఇద్దరు విద్యార్థుల మరణం, వందల మంది విద్యార్థులు ఆస్పత్రి పాలవ్వడానికి నిర్లక్ష్యమెవరది..? క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాల్సిన ఐటీడీఏ అధికారులదా..? లేక పాఠశాల సిబ్బందిదా..? అని విద్యార్థుల తల్లిదండ్రులు ఐటీడీఏ అధికారుల తీరుపై మండి పడుతున్నారు. గురుకుల పాఠశాలలో ఆర్వో ప్లాంట్ మూలకు చేరి సుమారు ఆరు మాసాలు గడుస్తోందని, మరుగుదొడ్లు అధ్వానంగా తయారయ్యాయని, వాటి నిర్వహణ కూడా అంతంత మాత్రంగానే ఉండడంతో ఆ సమీపంలోనే ఉన్న తాగునీరు బోరు, వంటశాల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారు కావడంతో తమ పిల్లలు అనారోగ్యం బారిన పడ్డారని గిరిజన విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు నెలలోనే ఓ విద్యార్థినికి పచ్చకామెర్లు వచ్చినట్లు గుర్తించారు. అప్పుడే జాగ్రత్త పడితే ఇంత వ్యాప్తి చెందేది కాదు. గురుకులంలో విద్యను అభ్యసిస్తున్నది 611 మందికాగా, వీరందరికి ఉన్న మరుగుదొడ్లు 32 మాత్రమే. అవికూడా అధ్వానంగా ఉన్నాయి. వసతిగృహం గదుల్లో విద్యాభ్యాసం, పడుకోవడం, భోజనం చేయడం, వాడుకనీరు సైతం విద్యార్థులు సంచరిస్తున్న ప్రాంతంలోనే ఉండడంతో ఒక్క సారిగా విద్యార్థులు అనారోగ్యం బారిన పడినట్టు గిరిజన సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.
● ఐటీడీఏ అధికారుల తీరుపై అసంతృప్తి..
ఐటీడీఏ పరిధిలో ఉన్న గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలను ఎప్పటికప్పుడు సంబంధిత డీడీ, ఏటీడబ్ల్యూఓలు పర్యవేక్షించాల్సి ఉంది. విద్యార్థులకు అందుతున్న మెనూ, ఆహారంలో నాణ్యత, ఆరోగ్యంపై పర్యవేక్షించాల్సి ఉన్నప్పటికీ సంబంధిత వసతిగృహ సంక్షేమాధికారుల వద్ద చేతివాటం కారణంగా పర్యవేక్షణ పక్కదారి పట్టి అది విద్యార్థులకు శాపంగా మారిందని గిరిజన సంఘా ల నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
● ఇప్పుడా చర్యలు..?
పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు మృతి చెంది, మరో 160 మంది వరకు పచ్చకామెర్ల బారిన పడి ఆస్పత్రిపాలైతే కాని అధికార యంత్రాంగం స్పందంచ లేదు. ఇంత తంతు జరిగిన తరువాత మాజీ ఉప ముఖ్య మంత్రి పాముల పుష్పశ్రీవాణి గురుకుల పాఠశాలను సందర్శించి సమస్యలను వెలుగులోకి తెచ్చిన తరువాత ఐటీడీఏ యంత్రాంగం స్పందించి మూలకు చేరిన ఆర్వో ప్లాంట్ స్థానంలో కొత్తది ఏర్పాటు, అధ్వానంగా ఉన్న మురుగుదొడ్లకు బదులుగా వెంటనే ఫైబర్ మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు.
ఇప్పటికీ స్పందించని వైనం
గురుకుల బాలికలకు హెపటైటిస్–ఏ సోకినట్లు చెప్పుకుంటున్నా ఇప్పటికీ అటు వైద్య ఆరోగ్యశాఖ గానీ, ఐటీడీఏ అధికారులు కానీ పూర్తిస్థాయిలో అధికారిక సమాచారం ఇవ్వడం లేదు. తాగునీటి కాలుష్యమా? లేదంటే పారిశుద్ధ్యలోపమా? ఆహారం వల్ల విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారా అన్నది పూర్తిస్థాయిలో అధికారులు తేల్చాల్సి ఉంది. తమ పిల్లలకు ఆరోగ్య భద్రత, ప్రాణ రక్షణ కల్పిస్తేనే చిన్నారులను పాఠశాలకు పంపిస్తామని గిరిజన విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు.
విద్యార్థుల మృతిపై ఎమ్మెల్యే స్పందించకపోవడం దురదృష్టకరం
ఇటీవల పచ్చ కామెర్లతో ఇద్దరు విద్యార్థులు మృతి చెందినా కూత వేటులో ఉన్న కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి స్పందించకపోవడంపై గిరిజన సంఘాల నాయకులు భగ్గుమంటున్నారు. కేవలం కూటమి ప్రభుత్వ నాయకులు వచ్చినప్పుడు మాత్రమే విద్యార్థుల కుటుంబాలను పరామర్శకు రావడాన్ని విమర్శిస్తున్నారు. మృతుల కుటుంబాలకు ఎలాంటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వడం గానీ, ప్రకటించడం కానీ లేదని, అబద్ధపు ప్రచారాలు చేస్తూ కాలయాపన చేస్తున్నారని వాపోతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర గడిచినా కనీసం నియోజకవర్గంలోని ఏ ఒక్క వసతి గృహాన్ని ఆమె సందర్శించలేదని, విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏడాదిన్నర పాలనలో గాలిలో విద్యార్థుల సంక్షేమం
కూటమి ప్రభుత్వ పాలనలో విద్యార్థుల సంక్షేమం కోసం చేసిందేమీ లేదనేది కురుపాం గురుకుల బాలికల పాఠశాలలో జరిగిన సంఘటనలే నిదర్శనం. ఆ పాఠశాలలో విద్యార్థుల కోసం నిర్మిస్తున్న అదనపు తరగతి గదులు పూర్తి చేసేందుకు నిధులు విడుదల చేయకపోవడం, ఆర్వో ప్లాంట్ పాడైనా వెంటనే మరమ్మతు పనులు నిమిత్తం ముందస్తు నిధులు కేటాయించకపోవడం ముమ్మాటికీ ప్రభుత్వ నిర్లక్ష్యమే. ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి మృతి చెందిన విద్యార్థులకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అందివ్వాలి. ఇలాంటి సంఘటనలు భవిష్యత్‌లో పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలి.
– తోట జీవన్న, సీపీఐ (ఎంఎల్)రెడ్ స్టార్ట్ జిల్లాకార్యదర్శి

గురుకుల విద్యార్థులు

గురుకుల విద్యార్థులు

గురుకుల విద్యార్థులు