
ప్రభుత్వ రంగంలోనే వైద్య కళాశాలలు కొనసాగించాలి
బొబ్బిలి: ప్రభుత్వ రంగంలోనే వైద్య కళాశాలలు కొనసాగించాలని వివిధ ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బొబ్బిలి ఎన్‌జీఓ హోంలో శుక్రవారం జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు పి.సత్యంనాయుడు అధ్యక్షతన ప్రభుత్వ వైద్య కళాశాలల ఆవశ్యకతపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసే పీపీపీ విధానాన్ని విరమించుకోవాలని ప్రభుత్వాన్ని ముక్తకంఠంతో కోరారు. జేవీవీ జిల్లా గౌరవాధ్యక్షుడు పి.శివానంద్ మాట్లాడుతూ వైద్య రంగం నుంచి తప్పుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించడం దారుణమన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరిస్తే ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక రాష్ట్ర నాయకురాలు కె.విజయగౌరి మాట్లాడుతూ పేద, మధ్యతరగతి ప్రజలకు వైద్య విద్యను దూరం చేసే పీపీపీ చర్యలను వెనుకకు తీసుకోవాలన్నారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర అకడమిక్ కౌన్సిలర్ జేసీ రాజు మాట్లాడుతూ కొత్తగా ప్రారంభిస్తున్న 17 మెడికల్‌కాలేజీల్లో 10 కాలేజీలను పీపీ ద్వారా కూటమి ప్రభుత్వం ప్రైవేటుకు అప్పగించే ప్రయత్నం ప్రజావ్యతిరేకమన్నారు. ఇది అభివృద్ధి తిరోగమన చర్యగా పేర్కొన్నారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర నాయకులు పి.ధనుంజయ్, డి.వెంకటనాయుడు మాట్లాడుతూ పేద, మధ్య తరగతి ప్రజలకు వైద్యవిద్యను దూరం చేసే ఈ చర్యను వెనుకకు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగంలో ఉన్నప్పుడే ప్రజలకు వైద్యం, వైద్యవిద్య అందుబాటులో ఉంటాయన్నారు. యూటీఎఫ్ జిల్లా సహాధ్యక్షుడు వి.ప్రసన్నకుమార్, సీఐటీయూ జిల్లా ఉపాధ్య క్షుడు పొట్నూరు శంకరరావు మాట్లాడుతూ నిర్మాణదశలో ఉన్న వైద్య కళాశాలల నిర్మాణాన్ని పూర్తిగా ప్రభుత్వమే చేపట్టాలని డిమాండ్ చేశారు. నిధులు లేవనే కారణాన్ని సాకుగా చూడకూడదన్నారు. విలువైన ప్రజాధనాన్ని, ఆస్తులను ప్రైవేటు పరం చేయడం అంటే అభివృద్ధి నిరోధానికి గేట్లెత్తేయడమేనన్నారు. అనంతరం మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నిర్మించాలని, పీపీపీ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని, ఇతర వైద్య కళాశాలలను బలోపేతం చేయాలని నినదించారు. ఈ అంశాలను తీర్మానిస్తున్నట్టు జేవీవీ నాయకులు స్వామినాయుడు తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అ ధ్యక్షుడు రాము, సీఐటీయూ నాయకులు లక్ష్మి, ప్రజా, ఉద్యోగ సంఘాల నాయకులు కె.కృష్ణదాసు, సుధాకర్, మహేష్, పి.సత్యనారాయణ, శ్రీనివాస్, శివ, కృష్ణమూర్తి పాల్గొన్నారు.
ఉద్యోగ, ప్రజాసంఘాల నాయకుల డిమాండ్