
వినూత్న సాగుతో ఆదర్శంగా..!
ఆయనొక రైతు. వ్యవసాయాన్ని నమ్ముకుని వారసత్వంగా వచ్చిన భూమిలో సరికొత్త పద్ధతిలో సాగుచేయడం ప్రారంభించారు. ఏ ఏడాదికి ఆ ఏడాది కొత్త విధానాలు అవలంబిస్తూ వ్యవసాయంలో పోటీపడుతున్నారు. ఉభయగోదావరి జిల్లాలోని రైతులకు దీటుగా ఇక్కడ వ్యవసాయం చేస్తూ దిగుబడులు సాధిస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. నేరుగా ఏపీ సీడ్స్‌కే ప్రతి ఏడాది విత్తనాలు అందించే ఆ రైతు ఈ ఏడాది కూడా ఖరీఫ్‌సాగులో మరో కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. ఖరీఫ్‌లో సాగుచేసే వరి పంటలో ఉభయగోదావరి జిల్లాల రైతులుఅవలంబిస్తున్న విధానాన్ని ఇక్కడ తన పంట పొలాల్లో ప్రారంభించారు. ఆయన మరెవరో కాదు రేగిడి మండలంలో ఉణుకూరు గ్రామానికి చెందిన గేదెల వెంకటేశ్వర రావు. – రేగిడి
లైన్‌సోయింగ్ పద్ధతిలో నాట్లు వేస్తున్న బెంగాల్ కూలీలు
● ఖరీఫ్‌లో కొత్త తరహా నాట్లు
● లైన్ సోయింగ్ విధానంతో
వరినారు ఆదా
● ఎకరాకు 8 కిలోల విత్తనాల
వరినారుతో ఉడుపు
● పశ్చిమబెంగాల్ కూలీలతో
వరి ఉభాలు
● రైతు గేదెల వెంకటేశ్వర రావు కృషి
ఇష్టంతోనే..
వ్యవసాయం కష్టంతో కాకుండా ఇష్టంతో చేయాలి. అప్పుడే మంచి ఫలితాలు వస్తాయి. విత్తనాల దగ్గర నుంచి ఎరువులు వరకూ ప్రతి పెట్టుబడికి ఇతరులపై ఆధార పడకూడదు. రైతు సొంతంగా విత్తనాలు తయారు చేసుకునే స్థితికి రావాలి. రసాయన ఎరువులు తగ్గించి సాగుచేసే విధానంవైపు రైతులు దృష్టిసారించాలి. మిగిలిన ప్రాంతాల్లోని రైతులతో పోటీపడే ఆలోచన రావాలి. అప్పుడే వ్యవసాయంలో లాభాలు కనిపిస్తాయి. ఈ ఏడాది లైన్‌సోయింగ్ విధానంలో వరినాట్లు వేశాం. ప్రస్తుతం పంట ఆశాజనకంగా ఉంది.
– గేదెల వెంకటేశ్వరరావు, జిల్లా వ్యవసాయ సలహా మండలి మాజీ అధ్యక్షుడు, ఉణుకూరు
జిల్లా వ్యవసాయ సలహా మండలి మాజీ అధ్యక్షుడు గేదెల వెంకటేశ్వరరావు ఉణుకూరు గ్రామంలో 50 ఎకరాలకు పైగా పంటపొలాలు ఉన్న రైతు. ఇంత ఆస్తి ఉన్నా తాను ఆ భూమిని ఎవరికీ కౌలుకు ఇవ్వలేదు. ఉన్నత చదువులు చదివినా ఉద్యోగం కోసం అర్రులు చాచలేదు. తల్లిదండ్రుల నుంచి వంశపారంపర్యంగా వచ్చిన భూమినే నమ్ముకున్నారు. వ్యవసాయాన్నే ఉద్యోగంగా మార్చుకుని ఊహతెలిసినప్పటి నుంచి వినూత్న పద్ధతుల్లో పంటలు సాగుచేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. రసాయన ఎరువుల మోతాదు తగ్గించి, సేంద్రియ ఎరువుల వినియోగంతో పాటు యాజమాన్య పద్ధతులు పాటిస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు. ఆది నుంచి ఆసక్తిగా వ్యవసాయం చేసే వెంకటేశ్వరరావుకు వ్యవసాయంలో వచ్చే కొత్త పద్ధతులు వేగంగా అందుకోవడం వెన్నతో పెట్టిన విద్య. ఇందులో భాగంగానే ఈ ఏడాది లైన్ సోయింగ్ విధానాన్ని అందుకుని, ఇక్కడ తన పంటపొలాల్లో ఈ పద్ధతిని ప్రారంభించారు.
8 కిలోల విత్తనాలతో ఎకరాలో సాగు
సాధారణంగా రైతులు ఎకరాసాగులో వరి ఉభాలకు 30 కిలోల వరకూ వరి విత్తనాలతో వరినారు తయారు చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఈ నారు సరిపోని పరిస్థితి ఉంటుంది. వరి ఉభాలు చేసిన సమయంలో ఈ ప్రాంతంలో కనీసం పదిమొక్కలను కలిపి ఒకేచోట వేస్తుంటారు. ఇలా కాకుండా ఒకచోట ఒక వరి నారును మాత్రమే ఉభాలు చేసి, ఒక వరి మొక్కకు మరో మొక్కకు మధ్య కనీసం పది అంగుళాల ఖాళీ ఉంచి ఉభాలు చేయడాన్ని లైన్‌సోయింగ్ విధానం అంటారు. ఈ విధానాన్ని ఉభయగోదావరి జిల్లాలోని రైతులు అవలంబిస్తున్నారు. ఈ విధానంతో ఆయా ప్రాంతాల్లో వరి పంట అధికంగా దిగుబడి రావడంతో పాటు చీడపీడలు తట్టుకుంటుంది. ఒక వరి మొలక కాస్తా పెరగగానే 30వరకూ పిలకలు వేసి పెద్ద దుబ్బుగా మారుతుంది. పెద్దగింజల కంకి హారం కట్టి, ఎకరాకు 40 బస్తాల వరకూ దిగుబడి వస్తుంది. ఈ విధానం నిమిత్తం వెంకటేశ్వర రావు ఎకరాకు 8కిలోలు చొప్పున విత్తనాలతో నారు పోసి పశ్చిమబెంగాల్ నుంచి కూలీలను తీసుకొచ్చి తనకున్న పొలాల్లో 40 ఎకరాల్లో ఈ విధానంలో వరినాట్లు వేయించారు. వారం రోజుల పాటు ఈ విధానంలో పంటపొలాల్లో వరినాట్లు వేయించారు. ప్రస్తుతం ఈ వరినాట్లు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ విధానాన్ని చూసిన మరో రైతు కూడా తనకున్న పది ఎకరాల్లో వరిసాగుచేస్తున్నారు.
దిగుబడి సాధనలో దిట్ట
గేదెల వెంకటేశ్వరరావుకు జిల్లాతో పాటు ఉభయగోదావరి జిల్లాల్లో కూడా పేరుంది. వరి పంటలో స్థానిక రకాలతో పాటు ఇతర ప్రాంతాల్లో సాగుచేసే సన్నాలు, మసూరి పంటలను కూడా సాగుచేస్తుంటారు. ఆయన వద్ద ఉభయగోదావరి జిల్లాలకు చెందిన రైతులు విత్తనాలు కొనుగోలు చేస్తుంటారు. వరితో పాటు మిరప, మొక్కజొన్న పంటల సాగులో కూడా మంచి దిగుబడి సాధించే సత్తా వెంకటేశ్వరరావుకు ఉంది. వ్యవసాయశాఖ అధికారులు, శాస్త్రవేత్తలు సైతం ఆయన సాగుచేస్తున్న పంటను పరిశీలించేందుకు వస్తుంటారు. ఆయన సాగుచేస్తున్న వరిపంటలో నాణ్యత ఉండడంతో గత 20 సంవత్సరాలుగా ఏపీ సీడ్స్‌కు విత్తనాలు అందిస్తున్నారు.

వినూత్న సాగుతో ఆదర్శంగా..!

వినూత్న సాగుతో ఆదర్శంగా..!

వినూత్న సాగుతో ఆదర్శంగా..!