మహిళా మార్ట్‌లో డీలాపడిన వ్యాపారం | - | Sakshi
Sakshi News home page

మహిళా మార్ట్‌లో డీలాపడిన వ్యాపారం

Aug 3 2025 8:42 AM | Updated on Aug 3 2025 8:52 AM

డ్వాక్రా మహిళలు తప్ప...ఇతరులు కొనుగోలు చేయని వైనం

మహిళల ఆర్థిక బలోపేతానికి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ మహిళా మార్ట్‌

కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్సార్‌ పేరును తొలగించిన నిర్వాహకులు

గతంలో రోజుకు రూ.80 వేల నుంచి

రూ.1 లక్ష వరకు జరిగిన వ్యాపారం

నేడు రూ.15 వేల నుంచి రూ.20 వేలకు పరిమితం

వ్యాపారాభివృద్ధిపై దృష్టి సారించని యంత్రాంగం

కష్టంగా మారిన మహిళా మార్ట్‌ నిర్వహణ

వీరఘట్టం: మహిళల ఆర్థిక స్వావలంభనకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టి ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపట్టింది. మహిళలను వ్యాపారవేత్తలుగా మార్చేందుకు మార్ట్‌లను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లాలోని వీరఘట్టంలో గతేడాది జనవరి 12న వైఎస్సార్‌ మహిళా మార్ట్‌ను ఏర్పాటు చేశారు. ఈ మార్ట్‌ ఏర్పాటుకు వీరఘట్టం మండలంలోని 15 వేల మంది డ్వాక్రా సంఘాల మహిళలు ఒక్కొక్కరూ రూ.200 పెట్టుబడితో రూ.30 లక్షలు పోగు చేసి వ్యాపారం ప్రారంభించారు. దీనికి గత ప్రభుత్వం కూడా కార్పొరేట్‌ కంపెనీలతో ఈ మార్ట్‌ను అనుసంధానం చేసి వీరికి కావాల్సిన నిత్యావసర సరుకులు, కాస్మోటిక్స్‌, వంటనూనెలు ఇలా అనేక వస్తువులను హోల్‌సేల్‌ మార్కెట్‌లో కొనుగోలు చేసి ఈ మార్ట్‌ ద్వారా విక్రయించడం ప్రారంభించారు. ప్రారంభించిన నాటి నుంచి మే నెల వరకు ఈ ఐదు నెలల్లో సుమారు రూ.1.50 కోట్లు వ్యాపారం చేపట్టారు. గత ఏడాది జూన్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత నేటి వరకు వ్యాపారాలు డీలా పడడంతో బేరాలు సన్నగిల్లి మార్ట్‌ నిర్వహణ భారంగా మారింది.

జోరు తగ్గిన మార్ట్‌ వ్యాపారం

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్సార్‌ మహిళా మార్ట్‌ బోర్డులో వైఎస్సార్‌ పేరును తొలగించారు. అంతేకాకుండా బ్యాంకు మాదిరి ఏసీ రూంలో ఉంటడడంతో మార్ట్‌ వైపు సామాన్యులు కూడా చూడడం లేదు. డ్వాక్రా సంఘాలకు చెందిన మహిళలు తప్ప ఇతరులు ఎవరూ ఇక్కడ సరుకులు కొనుగోలు చేయకపోవడంతో వ్యాపారం పూర్తిగా పడిపోయింది. ప్రస్తుతం మార్కెట్‌లో ఒక్కో కిరాణాషాపు రోజుకు రూ.1 లక్ష పైబడి అమ్మకాలు చేస్తున్నారు. మహిళా మార్ట్‌లో మాత్రం గత ఏడాదిగా రోజుకు రూ.15 వేల నుంచి రూ.20 వేలు మాత్రమే వ్యాపారం జరుగుతున్నట్టు నిర్వాహకులు చెబుతున్నారు.

వెలవెల బోతున్న మహిళా మార్ట్‌

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వీరఘట్టం మహిళా మార్ట్‌ కొనుగోలుదారులతో కళకళలాడేది. నేడు కొనుగోలుదారులు లేక మార్ట్‌ వెలవెలబోతోంది. సుమారు రూ.13 లక్షల వ్యయంతో మార్ట్‌ నిర్మాణం చేపట్టారు. ఇందులో పని చేస్తున్న కంప్యూటర్‌ ఆపరేటర్‌కు రూ.6 వేలు జీతం, ఇద్దరు సేల్స్‌ మెన్‌, ఉమెన్‌లకు రూ.12 వేలు జీతం, స్వీపర్‌కు రూ.3 వేలు, ఇంటి అద్దె రూ.25 వేలు, ప్రతీ నెలా కరెంట్‌ బిల్లు సరాసరిన రూ.6 వేలుతో కలిపి ప్రతీ నెలా నిర్వహణ ఖర్చు రూ.52 వేలు అవుతోంది. లాభం మాత్రం అంతంత మాత్రమే ఉండడంతో మార్ట్‌లో వ్యాపారం డీలా పడింది.

కొరవడిన పర్యవేక్షణ

వీరఘట్టం మెయిన్‌రోడ్డులో ఏర్పాటు చేసిన ఈ మార్ట్‌కు విశాలమైన స్థలం ఉంది. ఈ స్థలంలో సరుకులను కొనుగోలుదారులకు కనిపించేటట్టు ఏర్పాట్లు చేయాలి. అయితే అధికారులు వ్యాపారంపై దృష్టి సారించకపోవడంతో కొనుగోలుదారులు ఇటువైపు రావడం మానేశారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి మహిళా మార్ట్‌ వ్యాపారాభివృద్ధికి చర్యలు చేపట్టాలని పలువురు మహిళా సంఘాల సభ్యులు కోరుతున్నారు.

వ్యాపారాభివృద్ధికి చర్యలు చేపడతాం

మహిళా మార్ట్‌ అభివృద్ధికి చర్యలు చేపడతాం. మహిళా సంఘాలతో పాటు స్థానికులు కూడా ఇక్కడ సరుకులు కొనుగోలు చేసేలా అవగాహన కార్యక్రమాలను నిర్వహించి మార్ట్‌లో వ్యాపారాభివృద్ధికి చర్యలు తీసుకుంటాం. ప్రచారం పెంచి ప్రజలకు మార్కెట్‌ కంటే తక్కువ ధరకే నిత్యావసర సరుకులను అందజేసి మార్ట్‌కు పూర్వవైభవాన్ని తీసుకువచ్చేందుకు చర్యలు చేపడతాం. ఈ మార్ట్‌ను ప్రజలందరికీ దగ్గరగా ఉండేలా ఏర్పాటు చేస్తాం. – కె.లలితకుమారి,

జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు

మహిళా మార్ట్‌లో డీలాపడిన వ్యాపారం1
1/1

మహిళా మార్ట్‌లో డీలాపడిన వ్యాపారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement