
బొడ్డవర చెక్‌పోస్టు వద్ద.. గంజాయి రవాణాకు చెక్!
● ఒడిశా నుంచి కేరళకు గంజాయి తరలింపు
● ఎల్.కోట పోలీసులకు చిక్కిన ఇద్దరు నిందితులు
● 145 కిలోల గంజాయి, బొలెరో వాహనం స్వాధీనం
విజయనగరం క్రైమ్: ఎస్.కోట బొడ్డవర చెక్‌పోస్టు వద్ద గంజాయి అక్రమ రవాణాకు పోలీసులు చెక్ పెట్టారు. ఎల్.కోట పోలీసులకు అందిన కచ్చితమైన సమాచారంతో ఒడిశా నుంచి కేరళ రాష్ట్రానికి బొలెరో వాహనంలో గంజాయి తరలిస్తున్న ఇద్దరు నిందితులను బొడ్డవర చెక్‌పోస్టు వద్ద అదుపులోకి తీసుకున్నట్టు ఎస్పీ వకుల్ జిందల్ వెల్లడించారు. డీపీవోలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు. నిందితుల నుంచి 71 ప్యాకెట్లలో గల 145 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని వారిని రిమాండ్‌కు తరలించినట్టు ఎస్పీ తెలిపారు. పట్టుబడిన నిందితుల్లో ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లా పదువ మండలం కుదుబ్కికి చెందిన డంబు శిరగం అలియాస్ కృష్ణ(21), ఖసర్గాడ్ మంచజెవరం మండలం హూసంగలికి చెందిన మొహమ్మద్ షఫీక్(36)గా విచారణలో గుర్తించామన్నారు. కేరళ రాష్ట్రం ఖసర్గాడ్మంజెవరం మండలం హూసంగలికి చెందిన అబుబాకర్ సిద్ధికి ఆదేశాలతో కలిసి గంజాయిని డంబు శిరగం అలియాస్ కృష్ణ వద్ద కొనుగోలు చేసి బొలెరో వాహనంలో తరలిస్తుండగా ఎల్.కోట పోలీసులు గొల్జాం వద్ద వాహన తనిఖీలు చేపట్టి పట్టుకున్నారన్నారు. నిందితులపై చట్ట ప్రకారం దర్యాప్తు చేస్తామని, పీడీ చట్టం ప్రయోగిస్తామని తెలిపారు. గంజాయిని పట్టుకోవడంలో క్రియాశీలకంగా వ్యవహరించిన ఎస్.కోట రూరల్ సీఐ ఎల్.అప్పలనాయుడు, ఎల్.కోట ఎస్‌ఐ నవీన్ పడాల్, ఇతర పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించి ప్రశంసా పత్రాలను అందజేశారు. సమావేశంలో ఆయనతో పాటు విజయనగరం డీఎస్పీ శ్రీనివాస్, సీఐ అప్పలనాయుడు, ఎస్‌ఐ నవీన్ పడాల్, ఎస్‌బీ సీఐ ఏవీ లీలారావు పాల్గొన్నారు.