
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి●
● ఎస్‌ఎఫ్‌ఐ నిరాహార దీక్ష
పార్వతీపురం: విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సీహెచ్.పావని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టర్ కార్యాలయం గేటు వద్ద ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిరవధిక నిరాహర దీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డిగ్రీ పూర్తి అయిన తరువాత పీజీ చేయాలంటే ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని, జిల్లా కేంద్రాల్లో పీజీ సెంటర్‌లను ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వం విద్యారంగాన్ని ఛిన్నాభిన్నం చేస్తోందని, కార్పొరేట్‌లను ప్రోత్సహించేలా విధానాలను రూపొందిస్తోందని ఆరోపించారు. విద్యార్థులకు ఫీజు రియింబర్స్ మెంట్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. పాఠశాలలో ఏఎన్‌ఎంలను నియమించకపోవడంతో విద్యార్థుల మరణాలు సంభవిస్తున్నా యన్నారు. ఈ దీక్షలకు యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.మురళీమోహన్ మద్దతు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు టి.అఖిల్, ఎం.సంధ్య, కె.డేవిడ్, ఎ.గంగారావు, ఎం.సురేష్, జి.సంజీవ్, సింహాచలం, రాజేష్, చంటి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్స్‌కు కీలక మార్గదర్శకాలు
విజయనగరం అర్బన్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్‌కు కళాశాలల నిర్వహణకు సంబంధించి కీలకమైన మార్గదర్శకాలను ఇంటర్మీడియట్ విద్య ఆర్‌జేడీ మజ్జి ఆదినారాయణ విడుదల చేశారు. ఈ మేరకు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లాకు చెందిన 18 ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో గురువారం నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశంలో మార్గదర్శకాలపై వివరించారు. కార్యనిర్వహణ, విద్యాప్రమాణాల బలోపేతానికి సంబంధించిన సూచనలు విధిగా పాటించాలని కోరారు. కళాశాలల్లో పనిచేస్తున్న సిబ్బందికి హాజరు తప్పనిసరిగా ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ యాప్‌లో, భౌతిక హాజరు పుస్తకంలో నమోదు చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రవేశాల దృష్ట్యా మొదటి సంవత్సరం విద్యార్థులను ఈ నెల 11వ తేదీ వరకు చేర్చుకోవాలని స్పష్టం చేశారు. అలాగే విద్యార్థుల విజయశాతాన్ని పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, ప్రతిభావంతుల కోసం పోటీ పరీక్ష శిక్షణ అందించాలన్న మార్గదర్శకాలు పాటించాలన్నారు. సమావేశంలో ఆర్‌ఐఓ ఎస్.తవిటినాయుడు తదితరులు పాల్గొన్నారు
వరకట్న వేధింపులపై కేసు నమోదు
బాడంగి: కోరినంత బంగారం, కట్నం ఇవ్వలేదన్న కారణంగా నిశ్చితార్థం పూర్తయి పెళ్లివరకు వచ్చిన సంబంధం తప్పిపోయిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై స్థానిక పోలీసులు తెలిపిన కథనం ప్రకారం బాడంగి మండలంలోని గజరాయునివలస గ్రామానికి చెందిన కందుల చందనకు, బొబ్బిలికి చెందిన గ్రంధి సందీప్ గణేష్‌కు మేనెల 4వతేదీన నిశ్చితార్థం జరిగింది. అంతకుముందు పెళ్లిమాటల్లో 20 తులాల బంగారం, లక్షన్నర కట్నం ఆడపెళ్లివారు ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. కాగా నిశ్చితార్థం రోజున 10తులాల బంగారం, రూ.50 వేల నగదు అడ్వాన్స్‌గా పెల్లికుమారుడికి ఇచ్చారు. వారికి ఈనెల14వతేదీ పెళ్లి జరగాల్సి ఉండగా పెళ్లికొడుకు తండ్రి గ్రంధి దుర్గాప్రసాద్ అదనపుకట్నంగా మరోఐదుతులాల బంగారం కావాలని కోరడంతో ఆడపిల్లవారు ససేమిరా అన్నారు. దీంతో పెళ్లి ఆగిపోయింది. ఈ మేరకు పెళ్లికుమార్తె ఇచ్చిన ఫిర్యాదుతో పెళ్లికొడుకు, మామ దుర్గాప్రసాద్, అత్త జయలక్ష్మిల మీద వరకట్న వేధింపుల కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.పెళ్లికొడుకు తండ్రి బొబ్బిలి ఆర్‌డీఓ కార్యాలయంలో హెచ్‌డీటీగా పనిచేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.
మేడపై నుంచి జారిపడి యువకుడి మృతి
సాలూరు రూరల్: పట్టణ పరిధిలోని బొడ్డవలస గ్రామానికి చెందిన బండి మనోజ్ (25)తన ఇంటి మేడపై నుంచి జారి పడి మృతి చెందినట్లు పట్టణ సీఐ అప్పల నాయుడు తెలిపారు. ఇంటి మేడపై వడియాలు ఆరపెట్టేందుకు వెళ్లిన ఆయనకు గల శారీరక బలహీనత, అంగవైకల్యం కారణంగా ప్రమాదవశాత్తు జారిపడినట్లు తెలిపారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నామన్నారు.
772 లీటర్ల సారా ధ్వంసం
పార్వతీపురం రూరల్: ఇటీవల పట్టుబడిన 17 సారా కేసుల్లో స్వాధీనం చేసుకున్న 772 లీటర్ల సారాను పట్టణ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఏఎస్పీ అంకితా సురాన ఆధ్వర్యంలో పట్టణ శివారులో శుక్రవారం ధ్వంసం చేశారు. కార్యక్రమంలో ఎకై ్సజ్ అధికారులు సంతోష్‌కుమార్, పట్టణ సీఐ కె.మురళీధర్, ఎస్సై ఎం.గోవింద సిబ్బంది పాల్గొన్నారు.