
జానపద కళలను ఆదరించాలి
విజయనగరం టౌన్: అంతరించిపోతున్న జానపద కళలను ఆదరించి కళాకారులకు ప్రదర్శనలు కల్పించి ఉపాధి అవకాశాలు కల్పించాలని గిడుగు రామూర్తి తెలుగు భాష, జానపద కళాపీఠం అధ్యక్షుడు బద్రి కూర్మారావు కోరారు. కోట ప్రాంగణంలో ఉత్తరాంధ్ర నవచైతన్య నాట్య కళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కళాకారులు, కార్యవర్గ సమావేశం కార్యదర్శి చిన్నారెడ్డి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. సమావేశంలో వక్తలు మాట్లాడుతూ ఇటీవల కాలంలో హైదరాబాద్, అరకు, భోపాల్ వంటి చోట్ల జిల్లా జముకులు, తూర్పు భాగవతం, చెక్కభజన కళాకారులకు అవకాశం రావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు, దేవదాయ, ధర్మాదాయ శాఖ, సాంస్కృతిక శాఖ అంతరించిపోతున్న జానపద కళలను ఆదరించాలని కోరారు. ప్రజలు కూడా వీటిని ఆదరించి మన సంస్కృతిని కాపాడాలని కోరారు. 50 ఏళ్లు దాటిన కళాకారులకు పెన్షన్ సదుపాయం కల్పించాలని కోరారు. ఉత్తరాంధ్రలోని అతివేగంగా అంతరించిపోనున్న తూర్పు భాగవతం, రుంజ వాయిద్యం, జముకుల పాట, తప్పెటగుళ్లు, బుడగ జంగాల పాటలు, దాసర్ల పాటలు, చెక్క భజనలు, సాముగరిడీలు, పులివేషాలు వంటి కళలను ఆదరించి భావితరాలకు అందించాలన్నారు. సమావేశంలో జిల్లాలోని జముకుల పాట, చెక్కభజన, సాముగరిడి తదితర బృంద గురువులైన అట్టాడ లక్ష్మీనాయుడు, మత్స తవిటినాయుడు, మక్కువ మారినాయుడు, సింహాచలం, మిరియాల జగన్, పోలిరాజు, పి.సురేష్, రెడ్డి శంకరరావు, తౌడు, యువ కళాకారులు పాల్గొన్నారు.