
3వేల సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు
విజయనగరం క్రైమ్: ప్రజల భద్రత, నేరాల నియంత్రణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 3వేల సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఎస్పీ వకుల్ జిందల్ శనివారం తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు ముందుకు రావాలని కోరారు. సీసీ కెమెరాల పనితీరుపై స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో సెట్ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 2,125 సీసీ కెమెరాలు అమర్చామన్నారు. తొలుత ప్రజలు కోరిన చోట కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. పాఠశాలలు, వాణిజ్య సముదాయాలు, ఆలయాల పరిరక్షణకు సీసీ కెమెరాలు అవసరమన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు పర్యవేక్షణ బాధ్యతలను విజయనగరం, బొబ్బిలి, చీపురుపల్లి డీఎస్పీలకు అప్పగించారు.
వీడని ఏనుగుల బెడద
జియ్యమ్మవలస: మండలంలోని గవరమ్మపేట పంచాయతీ ఎరుకలపేట, వెంకటరాజపురం గ్రామస్తులను ఏనుగుల బెడద వీడడం లేదు. శనివారం ఉదయం గవరమ్మపేటలోని అరటి, పామాయిల్ తోటల్లో సంచరించిన ఏనుగులు సాయంత్రానికి ఎరుకలపేట, వెంకటరాజపురం పరిసర ప్రాంతాల్లోకి చేరుకున్నాయి. వరి పంటను ధ్వంసం చేస్తుండడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం స్పందించి నష్టపోయిన పంటకు పరిహారం అందజేయాలని కోరుతున్నారు.