
● రోడ్డు మీద రోడ్డు..
చిత్రం చూశారా.. చక్కగా ఉన్న రోడ్డుపై మళ్లీ రోడ్డు వేస్తున్నారన్న సందేహం కలుగుతోందా... అయితే ఆ రోడ్డు కథ తెలుసుకోవాల్సిందే. ప్రజాధనం దుర్వినియోగం తీరును పసిగట్టాల్సిందే. బొండపల్లి మండల కేంద్రంలోని జాతీయ రహదారి–26 నుంచి బొండపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్ సమీపంలోని శ్రీమన్నారాయణ ఆలయం వరకు 2024 మార్చిలో రూ.20 లక్షల ఉపాధి హామీ నిధులతో సీసీ రోడ్డు నిర్మించారు. రోడ్డు వేసిన ఏడాదికే మళ్లీ జాతీయ రహదారి నుంచి జిల్లా పరిషత్ హైస్కూల్ వరకు రూ.40 లక్షల ఉపాధిహామీ నిధులతో 3.7 మీటర్ల వెడల్పు, 300 మీటర్ల పొడవున సిమెంటు రోడ్డు నిర్మాణ పనులను రెండు రోజులుగా చేపడుతున్నారు. గతంలో వేసిన సిమెంట్ రోడ్డు చక్కగా ఉన్నా దానిపై రోడ్డు వేయడాన్ని చూసిన వారు ముక్కునవేలేసుకుంటున్నారు. శ్రీమన్నారాయణ గుడి నుంచి జెడ్పీ హైస్కూల్ వరకు ఉన్న మట్టి రోడ్డును సిమెంట్ రోడ్డు నిర్మించేవరకు ఫరవాలేదని, గతంలో జాతీయ రహదారి నుంచి గుడివరకు నిర్మించిన రోడ్డుపై మళ్లీ రోడ్డు వేయడాన్ని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రజాధనం దుర్వినియోగానికి ఈ రోడ్డే నిలువెత్తు నిదర్శనమని విమర్శిస్తున్నారు. ఉన్నతాధికారులు పరిశీలిస్తే నిధులు కొల్లగొట్టే తీరు బయటపడుతుందని చెబుతున్నారు. ఇదే విషయాన్ని పంచాయతీరాజ్ జేఈ పి.అప్పలనాయుడు వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా జాతీయ రహదారి నుంచి రోడ్డు వెడల్పు చేయడంతో పాటు, గుడి నుంచి హైస్కూల్ వరకు నిర్మాణం చేయని మట్టిరోడ్డుపై సిమెంట్ రోడ్డు వేస్తున్నట్టు తెలిపారు.
– బొండపల్లి