ఆటో బోల్తా పడడంతో ఒకరి మృతి
సీతంపేట: మండలంలోని ఇసుకగెడ్డ వద్ద ఆటో బోల్తాపడిన సంఘటనలో పాలకొండ మండలం వెలగవాడకు చెందిన జి.లక్ష్మణరావు(38) అనే వ్యక్తి మృతి చెందగా.. మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. శనివారం జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సీతంపేట నుంచి పాలకొండ వైపు వెళ్తున్న ఆటో ఇసుకగెడ్డ వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఆటోలో ఉన్న లక్ష్మణరావు అపస్మారక స్థితికి చేరుకోగా.. మరో నలుగురికి గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు స్పందించి 108 వాహనంలో క్షతగాత్రులను పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే వైద్య సిబ్బంది సకాలంలో స్పందించకపోవడం వల్లే లక్ష్మణరావు మృతి చెందాడని కుటుంబ సభ్యులు, బంధవులు ఆరోపిస్తూ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. మృతుడికి భార్య మేరీ, ఇద్దరు ఆడపిల్లలున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వై.అమ్మన్నరావు తెలిపారు.
మరో నలుగురికి గాయాలు


