చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
వేపాడ: మండలంలోని వీలుపర్తి క్వారీలో పనిచేస్తున్న కార్మికుడు ప్రమాదవశాత్తు పడిపోవడంతో గాయాలపాలై విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం మరణించాడు. ఇందుకు సంబంధించి వల్లంపూడి ఎస్సై బి.దేవి అందించిన వివరాలిలా ఉన్నాయి. అనకాపల్లి జిల్లా నాతవరం మండలం చెర్లోపాలెం గ్రామానికి చెందిన సీహెచ్ సత్తిబాబు(54) వీలుపర్తి క్వారీలో పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి కాలకృత్యాలకు వెళ్లిన సత్తిబాబు రాళ్ల గుట్టపై నుంచి ప్రమాదవశాత్తు పడిపోయి గాయాలపాలయ్యాడు. దీంతో అక్కడే ఉన్న తోటి కార్మికులు విశాఖ తరలించి కేజీహెచ్‌లో చేర్చగా చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయినట్లు మృతుడి కుమారుడు సీహెచ్.రాజేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహించినట్లు ఎస్సై బి.దేవి తెలిపారు. మృతిచెందిన సత్తిబాబుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.


