అందరికీ మోక్షం చూపిన చేతులకు చివరికి కన్నీటి వీడ్కోలు కరువు | - | Sakshi
Sakshi News home page

అందరికీ మోక్షం చూపిన చేతులకు చివరికి కన్నీటి వీడ్కోలు కరువు

Aug 31 2026 12:08 AM | Updated on Aug 31 2026 12:08 AM

ఇదీ కాటికాపరి చివరి మజిలీ

డాబాగార్డెన్స్‌: మంటల్లో కాలిపోయే శరీరాల మధ్యే ఆయన జీవితం గడిచింది. ఇతరులకు చివరి వీడ్కోలు పలకడమే ఆయన వృత్తి.. వేలాది కుటుంబాల కన్నీళ్లకు సాక్షిగా నిలిచిన ఆయన చివరికి ఆ మట్టిలోనే కలిసిపోయారు.

ఊరి చివర ఉన్న శ్మశాన వాటికే ఆయన ఇల్లు.. అక్కడి నిశ్శబ్దమే ఆయనకు పరిచయం. పండుగల వేళ ప్రపంచం ఆనందాల్లో మునిగితే.. ఆయన మాత్రం మరో అంతిమ యాత్ర కోసం ఎదురుచూసేవారు. సమాజానికి అవసరమైనప్పుడు ముందుండే ఆయనకు.. పని ముగిసిన తర్వాత మాత్రం దూరం పాటించే పరిస్థితి.

ఆయనే కప్పరాడకు చెందిన ముప్పిడి సూరిదేముడు. దాదాపు 30 ఏళ్ల పాటు విశాఖ కాన్వెంట్‌ జంక్షన్‌ హిందూ శ్మశాన వాటికలో కాటికాపరిగా సేవలందించారు. వేలాది మందికి అంతిమ సంస్కారాలు నిర్వహించిన ఆయన జీవితం చివరకు ఎవరికీ తెలియని నిశ్శబ్ద ప్రయాణంగా ముగిసింది.

రిక్షా నుంచి కాటికాపరి వరకు..

సుమారు మూడు దశాబ్దాల క్రితం సూరిదేముడు రిక్షా లాగుతూ జీవనం సాగించేవారు. పరిసర ప్రాంతాల్లోని కర్రల దుకాణాల నుంచి శ్మశాన వాటికకు దహన సంస్కారాల కోసం కర్రలు తీసుకొచ్చేవారు. ఆ సమయంలో అక్కడ కాటికాపర్లు లేని సందర్భాల్లో మృతదేహాల దహన కార్యక్రమాల్లో సహాయం చేసేవారు.అలా మొదలైన అనుబంధం.. చివరకు అదే ఆయన జీవనాధారంగా మారింది. రిక్షాను పక్కన పెట్టి పూర్తిస్థాయిలో కాటికాపరిగా మారారు. భార్యను కోల్పోయినా.. వచ్చిన ఆదాయంతో ఇద్దరు పిల్లలకు వివాహాలు చేశారు.

20 వేల మందికి పైగా అంతిమ సంస్కారాలు

సూరిదేముడు లెక్కలేనన్ని మృతదేహాలకు సంస్కారాలు నిర్వహించారు. రోజుకు సగటున ఇద్దరి చొప్పున దహన సంస్కారాలు చేసినట్లు సహచరులు చెబుతున్నారు. అంటే నెలకు సుమారు 60 మంది.. ఏడాదికి 700 మందికిపైగా.. 30 ఏళ్లలో దాదాపు 20 వేల మందికి పైగా ఆయన చేతుల మీదుగా అంతిమ వీడ్కోలు పొందారు. ఎన్నో కుటుంబాల విషాద సమయంలో ధైర్యంగా నిలిచిన ఆయన.. తన జీవితంలో మాత్రం ఒంటరితనాన్నే అనుభవించారు.

చివరి రోజుల్లోనూ ఒంటరి పోరాటమే

ఇటీవల సూరిదేముడు కాలికి ఇనుప ముక్క గుచ్చుకుంది. ఇన్‌ఫెక్షన్‌ కారణంగా కాలు పూర్తిగా దెబ్బతింది. దాదాపు రెండు నెలలు మంచానికే పరిమితమయ్యారు. శ్మశాన వాటిక సిబ్బంది తమకు తోచిన ఆర్థిక సహాయం అందించారు. ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఇటీవల మృతి చెందారు.అయితే ఆయన మరణ వార్త కూడా వెంటనే బయటకు రాలేదు. ఇంటి వద్ద సాయంత్రం మృతి చెందగా.. మరుసటి రోజు వరకు శ్మశాన వాటిక సిబ్బందికి సమాచారం అందలేదు.

చివరికి నిశ్శబ్ద వీడ్కోలు

మరణించిన ప్రతి ఒక్కరికీ గౌరవప్రదమైన అంతిమ సంస్కారం అందేలా చూసిన సూరిదేముడు.. తన చివరి ప్రయాణంలో మాత్రం ఎలాంటి ఆర్భాటం లేకుండానే అదే శ్మశాన వాటికకు చేరుకున్నాడు.బాజాభజంత్రీలు లేవు.. పెద్ద సంఖ్యలో జనం లేరు.. కన్నీటి వీడ్కోలు పలికేవారు కూడా తక్కువే.జీవితాంతం ఇతరులకు మోక్ష మార్గం చూపిన కాటికాపరి.. చివరకు అదే బూడిదలో కలిసిపోయారు.సమాజం చివరి క్షణాల్లో గుర్తు చేసుకునే వృత్తి ఇది.. కానీ ఆ వృత్తి చేసే మనిషిని మాత్రం జీవితాంతం గుర్తుపెట్టుకోలేని విషాదం ఇది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement