విశాఖ భూగర్భంలో జల సంక్షోభం | - | Sakshi
Sakshi News home page

విశాఖ భూగర్భంలో జల సంక్షోభం

May 3 2026 10:10 AM | Updated on May 3 2026 10:10 AM

పాతాళంలోకి జారుతున్న జలసిరి

ఎండాడలో ఏడాదిలోనే 30 అడుగుల మేర పతనం

రుషికొండ, గోపాలపట్నం, అప్పుఘర్‌లో అదే పరిస్థితి

వర్షాభావం, అధిక వినియోగం, నిర్లక్ష్యమే కారణాలు

మేల్కోకపోతే మరింత ముప్పంటున్న నిపుణులు

సాక్షి, విశాఖపట్నం: సాగరతీర నగరం విశాఖ ఇప్పుడు నీటి కోసం విలవిలలాడుతోంది. ఒకప్పుడు నిండుకుండలా ఉండే భూగర్భ జలాలు క్రమంగా అడుగంటిపోతూ, నగరాన్ని తీవ్రమైన సంక్షోభం వైపు నెట్టుతున్నాయి. వేసవి తీవ్రత పెరిగేకొద్దీ పరిస్థితి మరింత విషమంగా మారుతోంది. నగరవాసులు గుక్కెడు నీటి కోసం వందల అడుగుల లోతుకు పైపులు వేయాల్సిన దుస్థితి ఏర్పడింది. కోర్‌ సిటీతో పాటు శివారు ప్రాంతాల్లోనూ భూగర్భ జల సంక్షోభం ముదురుతోంది. గతేడాది వరకు అందుబాటులో ఉన్న నీరు ఇప్పుడు మరింత లోతుల్లోకి జారిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వ నిర్లక్ష్యం, నీటి సంరక్షణ పద్ధతుల పట్ల అవగాహన లోపం ఈ పరిస్థితికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయి.

ఏడాదిలోనే 30 అడుగుల పతనం

భూగర్భ జలవనరుల శాఖ గణాంకాలు పరిస్థితి తీవ్రతను స్పష్టంగా చూపిస్తున్నాయి. నగరంలోని ఐటీ కారిడార్‌ పరిసరాల్లో నీటి మట్టం గణనీయంగా పడిపోయింది. ఎండాడ ప్రాంతంలో గతేడాది 64 అడుగుల లోతులో లభించిన నీరు, ఈ ఏడాది 94 అడుగులకు పడిపోయింది. అంటే కేవలం ఏడాదిలోనే 30 అడుగుల మేర తగ్గుదల నమోదైంది. ఇదే విధంగా రుషికొండలో 16 అడుగులు, గోపాలపట్నంలో 9 అడుగులు, అప్పుఘర్‌లో 5 అడుగులు జలమట్టం పడిపోవడం అక్కడి పరిస్థితి ఎంత తీవ్రమో తెలియజేస్తోంది.

స్ట్రెస్‌ జోన్‌లుగా మారుతున్నాయి..

సాధారణంగా భూగర్భ జలాలు 10 మీటర్ల (సుమారు 33 అడుగులు)లోపు ఉంటే సురక్షితం. కానీ విశాఖలో సగటు మట్టం ఇప్పటికే ఈ పరిమితిని దాటేసింది. 10 మీటర్ల కంటే ఎక్కువ లోతుకు నీరు వెళ్తే దానిని ’స్ట్రెస్‌ జోన్‌’ అంటారు. విశాఖలో మెజారిటీ ప్రాంతాలు ఇప్పుడు ఈ జోన్‌లోకి వెళ్తున్నాయి.

పొంచి ఉన్న ’సాల్ట్‌ వాటర్‌’ ముప్పు

తీర ప్రాంతాల్లో భూగర్భ జలాలు తగ్గితే, సముద్రపు ఉప్పు నీరు భూమిలోకి చొచ్చుకొచ్చే ప్రమాదం ఉంది. ఒకసారి సముద్రపు నీరు భూమిలోకి ప్రవేశిస్తే, ఉన్న కొద్దిపాటి జలాలు కూడా తాగడానికి, వాడుకోవడానికి పనికిరాకుండా పోతాయి. అప్పుఘర్‌, ఎండాడ, రుషికొండ వంటి ప్రాంతాలు ఈ ముప్పుకు గురయ్యే అవకాశముంది.

పర్యావరణ సమతుల్యతదెబ్బతినే ప్రమాదం

నగరంలో భూగర్భ జలమట్టం 10 మీటర్ల కంటే దిగువకు పడిపోవడం పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందనే సంకేతం. దీనివల్ల భవిష్యత్తులో భూమి కుంగిపోయే ప్రమాదం కూడా ఉంది. తీర ప్రాంతాలకు సమీపంగా ఉన్న ఎండాడ, రుషికొండ వంటి ప్రాంతాల్లో నీరు అడుగంటితే, సముద్రపు ఉప్పునీరు భూమిలోకి చొచ్చుకువచ్చే ప్రమాదం ఉంది. అపార్ట్‌మెంట్‌ యజమానులు కేవలం బోర్లపైనే ఆధారపడకుండా, వర్షపు నీటిని భూమిలోకి మళ్లించే ఇంకుడు గుంతలను శాసీ్త్రయ పద్ధతిలో ఏర్పాటు చేయాలి. ఖాళీ ప్రదేశాల్లో సహజంగా నీరు ఇంకేలా చూడా లి. ప్రభుత్వం కూడా ఓవర్‌ ఎక్స్‌ప్లాయిటెడ్‌ జోన్లలో కొత్త బోర్ల తవ్వకాలపై ఆంక్షలు విధించాలి. –ప్రొ.భానుకుమార్‌, వాతావరణ నిపుణుడు

బోరు బావులు ఎండిపోయాయి

గతేడాది మే వరకు బోరులో నీళ్లు వచ్చేవి. కానీ ఈసారి ఏప్రిల్‌లోనే చుక్క నీరు రావడం లేదు. వీధి మొత్తం ఇదే పరిస్థితి. జీవీఎంసీ నీటి కోసమే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది.

–అల్లూరి పార్వతి, గృహిణి, ఎండాడ

మళ్లీ డిగ్గింగ్‌ చేయాల్సి వస్తోంది

అపార్ట్‌మెంట్లలో బోర్లకు నీరు అందక పైపులను మరింత లోతుకు దించుతున్నాం. 100 అడుగులు వేస్తే కానీ నీటి చుక్క పడటం లేదు. జీవీఎంసీ స్పందించి నీటి సరఫరా పెంచకపోతే భవిష్యత్తులో ఇక్కడ నివసించడం అసాధ్యం. – మాదురాజు, ఎండాడ

సంక్షోభానికి కారణాలివే..

కాంక్రీట్‌ జంగిల్‌: నగరం శరవేగంగా విస్తరిస్తోంది. ఖాళీ స్థలాలన్నీ సిమెంట్‌ రోడ్లు, అపార్ట్‌మెంట్లతో నిండిపోవడంతో వర్షపు నీరు భూమిలోకి ఇంకే దారి లేక నేరుగా సముద్రం పాలవుతోంది.

అపరిమిత వినియోగం: పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వేల సంఖ్యలో బోరు బావులను తవ్వేస్తున్నారు. భారీ అపార్ట్‌మెంట్లలో నిరంతరం మోటార్ల ద్వారా నీటిని తోడేస్తుండటంతో భూగర్భం ఖాళీ అవుతోంది.

లోటు వర్షపాతం: గతేడాది రుతుపవనాల ప్రభా వం తగ్గడం, ‘ఎల్‌ నినో’ ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల భూమిలోని తేమ ఆవిరైపోతోంది.

ప్రభుత్వ నిర్లక్ష్యం: చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత.. నీటి సంరక్షణ చర్యల్ని గాలికొదిలేశారు. నిబంధనల ప్రకారం ప్రతి భవనానికి ఉండాల్సిన వర్షపు నీటి నిల్వ వ్యవస్థల్ని సక్రమంగా అమలు చెయ్యలేదు. ఇదే ప్రస్తుతం శాపంగా మారింది.

Advertisement
 
Advertisement
Advertisement