సీపీఎం నాయకులు
తగరపువలస: ఆనందపురం మండలం తర్లువాడలోని గూగుల్ డేటా సెంటర్ భూ బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన సీపీఎం నాయకులను గురువారం సాయంత్రం పోలీసులు అడ్డుకున్నారు. వారిని బలవంతంగా అదుపులోకి తీసుకుని ఆనందపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అరెస్టయిన వారిలో జీవీఎంసీ 78వ వార్డు మాజీ కార్పొరేటర్ గంగారావు, సీపీఎం భీమిలి డివిజన్ కార్యదర్శి ఆర్‌ఎస్‌ఎన్ మూర్తి ఉన్నారు. గూగుల్ డేటా సెంటర్ కోసం భూములు కోల్పోయిన 520 మంది రైతులకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం చెల్లించిన తర్వాతే పనులు ప్రారంభించాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం అక్కడ భారీ పోలీసు పహారా మధ్య పనులు జరుగుతుండటంతో, అక్కడి పరిస్థితిని సమీక్షించేందుకు వెళ్లిన నాయకులను సుమారు వంద మంది పోలీసులు గ్రామ పొలిమేరలోనే అడ్డుకున్నారు. వారిని చుట్టుముట్టి పోలీసు వాహనంలో స్టేషన్‌కు తరలించడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా బాధిత రైతులు మాట్లాడుతూ.. గూగుల్ డేటా సెంటర్‌కు వ్యతిరేకంగా తాము నోరు మెదపకుండా సుమారు 400 మంది పోలీసులు గ్రామంలో 24 గంటలూ మోహరించి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత పది రోజులుగా రైతులను అనుమానిస్తూ అక్రమ కేసులు పెడతామని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. గతంలో పూర్వ కలెక్టర్ హరేందిర ప్రసాద్, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఇచ్చిన హామీ మేరకు 520 మంది రైతులకు తలా మూడు సెంట్ల భూమి కేటాయించలేదని వాపోయారు. తమకు రావాల్సిన భూములను బినామీల పేరుతో కొందరు నేతలు కాజేసి కోట్లు గడిస్తున్నారని విమర్శించారు. కాగా.. పోలీసుల తీరుపై మాజీ కార్పొరేటర్ గంగారావు, ఆర్‌ఎస్‌ఎన్ మూర్తి మండిపడ్డారు. బాధితులను కలవనీయకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘన అని పేర్కొన్నారు. అక్రమ అరెస్టులతో ప్రజా ఉద్యమాలను ఆపలేరని నిరసన వ్యక్తం చేశారు


