అల్లిపురం: దేశంలోనే అత్యున్నత నగరంగా ఎదుగుతున్న విశాఖపట్నాన్ని భిక్షాటన రహిత నగరంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. ఇందుకోసం ఒక వినూత్నమైన ప్రణాళికను రూపొందించామని చెప్పారు. ‘జ్యోతిర్గమయ’పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమంలో స్టేషన్ హౌస్ ఆఫీసర్లు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఇప్పటివరకు 491 మందికి ఆశ్రయం కల్పించామని వివరించారు. గురువారం సాయంత్రం నగర పోలీస్ కమిషనరేట్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జ్యోతిర్గమయ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు 123 మందిని వారి కుటుంబ సభ్యులకు అప్పగించామన్నారు. మానసిక స్థితి సరిగా లేని 59 మందిని ప్రభుత్వ మానసిక చికిత్సాలయంలో, మరో 49 మందిని మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్‌లో చేర్పించినట్లు తెలిపారు. ఈ ప్రణాళిక అమలు బాధ్యతను పోలీస్ కంట్రోల్ రూమ్ ఇన్‌స్పెక్టర్, వైజాగ్ వలంటీర్స్ సంస్థ వ్యవస్థాపకుడు సతీష్‌తో పాటు స్థానిక ఎస్‌హెచ్‌వోలకు అప్పగించినట్లు పేర్కొన్నారు. ట్రాన్స్‌జెండర్ల వివరాలను సేకరించి, వారి విద్యార్హతలకు అనుగుణంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని సీపీ వివరించారు. సొంతంగా వ్యాపారం చేసుకోవాలనుకునే వారికి బ్యాంకుల ద్వారా రుణాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటికే 20 మంది ట్రాన్స్‌జెండర్లకు జీవీఎంసీలో ఉపాధి కల్పించామని, మరో 10 మందికి ఉపాధి లభించేలా మహిళా పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో టీ–టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేయించామన్నారు. పాత నేరస్తుల్లో పరివర్తన తెచ్చి వారికి స్వయం ఉపాధి కల్పించినట్లు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా నిరాశ్రయులకు ఆటో రిక్షాలు, బ్యాంకు రుణాలు పంపిణీ చేశారు.


