నగరంలో పల్లె సోయగం
మురళీనగర్‌లో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు
పులివేషధారుల విన్యాసాలు
మురళీనగర్: కాంక్రీట్ జంగిల్‌లో స్వచ్ఛమైన పల్లె వాతావరణం పలకరించింది. తెలుగుదనం ఉట్టిపడేలా మురళీనగర్ వాసులు సంక్రాంతి సంబరాల్లో మునిగితేలారు. స్థానిక వైశాఖి స్పోర్ట్స్ పార్క్ వేదికగా బుధవారం భోగి, సంక్రాంతి వేడుకలు కనులపండువగా జరిగాయి.
తెలుగు సంస్కృతికి పట్టాభిషేకం
ఉదయం 5.30 గంటలకే పార్కు ప్రాంగణం భోగి మంటల వెలుగులతో జిగేలుమన్నది. చలి పులిని తరిమికొడుతూ, వెచ్చని భోగి మంటల చుట్టూ జనం ఆనందంతో కేరింతలు కొట్టారు. మురళీనగర్ జంట కాలనీల్లోని 13 సెక్టార్ల కుటుంబాలు సంప్రదాయ వస్త్రధారణతో తరలివచ్చి తెలుగు సంస్కృతికి అద్దం పట్టాయి. నేటి యువతరానికి మన ఆచారాలు, గ్రామీణ పద్ధతులను పరిచయం చేయడమే లక్ష్యంగా ఈ వేడుకలు సాగాయి. రావమ్మ మహాలక్ష్మి.. రావమ్మ అంటూ హరిదాసుల కీర్తనలు, డూడూ బసవన్నల విన్యాసాలు పండుగ శోభను రెట్టింపు చేశాయి. పీటపై నాలుగు కాళ్లతో గంగిరెద్దులు నిలబడి చేసిన విన్యాసాలు చూపరులను ఆశ్చర్యపరిచాయి. తప్పెటగుళ్లు కళాకారుల దరువులు, ఒళ్లు గగుర్పాటు కలిగించే పులివేషధారుల ప్రదర్శనలు, మహిళల కోలాటాలు ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సంప్రదాయబద్ధంగా చిన్నపిల్లలకు భోగి పళ్లు పోసి పెద్దలు ఆశీర్వదించారు. అనంతరం అందరికీ భోగి ప్రసాదాలను పంపిణీ చేశారు. చిన్నాపెద్దా తేడా లేకుండా డప్పు వాయిద్యాలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ ఎంజాయ్ చేశారు.
గంగిరెద్దు ప్రదర్శన
భోగభాగ్యాలతో వర్ధిల్లాలి
ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్ రాజు హాజరయ్యారు. ప్రజల జీవితాలు సిరిసంపదలతో, భోగభాగ్యాలతో తులతూగాలని వారు ఆకాంక్షించారు. పాశ్చాత్య పోకడలకు పోకుండా, మన సంప్రదాయాలను భావితరాలకు అందిస్తున్న వైశాఖి స్పోర్ట్స్ నిర్వాహకులను అభినందించారు. పార్కు అధ్యక్షుడు ఎస్.వరప్రసాద్ సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు శ్యామలా దీపిక, సునీల్ అగర్వాల్, విజిలెన్స్ అడిషనల్ ఎస్పీ కింజరాపు ప్రభాకరరావు, జిల్లా రిజిస్ట్రార్ ఉపేంద్ర, వైఎస్సార్ సీపీ నేత రొంగలి జగన్నాధం, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకరరావు, జె. పృథ్వీరాజు,జనసేన సమన్వయకర్త పి.ఉషాకిరణ్, తదితరులు పాల్గొన్నారు.
నగరంలో పల్లె సోయగం
నగరంలో పల్లె సోయగం
నగరంలో పల్లె సోయగం
నగరంలో పల్లె సోయగం


