బోడి బంగ్లాకు రాజకీయ తాళం
మహారాణిపేట: నగరంలోని 30వ వార్డు శాలిపేటలో శతాబ్ద కాలం నాటి చరిత్ర కలిగిన బోడి బంగ్లా (పిండప్రదానాల భవనం)కు తాళం వేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. హిందూ సమాజం అంతిమ సంస్కారాలు, పితృ కార్యకలాపాల కోసం కేటాయించిన ఈ భవనాన్ని స్థానిక కార్పొరేటర్ కోడూరు అప్పలరత్నం తాళం వేసి జీవీఎంసీకి అప్పగించడం విమర్శలకు తావిస్తున్నాయి. ఈ చర్యను విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్‌తో పాటు పలు బ్రాహ్మణ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. సుమారు రూ. 6 కోట్ల విలువైన ఈ స్థలంపై కన్నేసిన అధికార పార్టీ నేతలు, దానిని ఆక్రమించుకునేందుకే కుట్ర పూరితంగా తాళాలు వేయించారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ వివాదంపై విశ్వహిందూ పరిషత్ నేత పుడిపెద్ది శర్మ సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేయగా, మంగళవారం మహారాణిపేట పోలీసు స్టేషన్‌లో కూడా ఫిర్యాదు నమోదైంది. 1902లో తెన్నేటి విశ్వనాథం, ఆకెళ్ల సుబ్రహ్మణ్యం జమీందారు కలిసి హిందూ ధర్మ కార్యాల కోసం ఈ స్థలాన్ని కేటాయించారు. అప్పటి నుంచి ఇక్కడ నిరంతరాయంగా కర్మకాండలు జరుగుతున్నాయి. అటువంటి పవిత్ర స్థలాన్ని మూసివేసి భక్తులకు ఇబ్బంది కలిగించడం అన్యాయమని, వెంటనే తాళాలు తీసి యథావిధిగా కార్యక్రమాలు జరిగేలా చూడాలని హిందూ సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరించారు.
బోడి బంగ్లాకు రాజకీయ తాళం


