ఎంపీ బాబూరావును కలిసిన లక్నో ఏడీజీపీ
నక్కపల్లి: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నో ఏసీబీలో అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(ఏడీజీపీ)గా పనిచేస్తున్న ఐపీఎస్ అధికారి కిల్లాడ సత్యనారాయణ మంగళవారం విశాఖపట్నంలో రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావును మర్యాద పూర్వకంగా కలిశారు. అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలంలోని పాములవాక గ్రామానికి చెందిన సత్యనారాయణ సెకెండరీ గ్రేడ్ ఉపాద్యాయుడిగా పనిచేస్తూ సివిల్స్‌కు ప్రిపేర్ అయి 1996లో యూపీ ఐపీఎస్ కేడర్‌కు ఎంపికయ్యారు. ఆగ్రా ఏఎస్పీగా మొదటి పోస్టింగ్ పొందిన ఆయన మీరట్, ఝాన్సీ ఎస్పీగా, వారణాసి డీఐజీగా సేవలందించారు. సమర్థవంతమైన ఐపీఎస్ అధికారిగా పేరు సంపాదించుకుని ఐదేళ్లపాటు ఏపీలో డిప్యూటేషన్‌పై అనంతపురం రేంజ్ డీఐజీగా, ఏపీ ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్‌గా పనిచేశారు. తర్వాత తిరిగి యూపీకి వెళ్లిపోయారు. సంక్రాంతి పండక్కి స్వగ్రామానికి కుటుంబ సభ్యులతో వచ్చిన ఆయన విశాఖలో ఎంపీ బాబూరావును కలిశారు. తాను ఎమ్మెల్యేగా రెండు పర్యాయాలు ప్రాతినిధ్యం వహించిన పాయకరావుపేట నియోజకవర్గానికి చెందిన సత్యనారాయణ ఐపీఎస్ అధికారిగా పనిచేయడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా బాబూరావు అన్నారు. ఆయన్ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జీవీ రవిరాజు, శంకర్‌రెడ్డి, బొడ్డేటి గంగా మహేష్, డిప్యూటీ మాజీ మేయర్ దాడి సత్యనారాయణ, పురుషోత్తం రెడ్డి, బోరా కుమార్‌రెడ్డి, దల్లి రామకృష్ణారెడ్డి, శివకుమార్‌రెడ్డి పాల్గొన్నారు.


