స్వయం సంవృద్ధి ఆర్థిక వ్యవస్థగా వీఎంఆర్‌డీఏ
విశాఖ సిటీ: విశాఖ గ్రాంట్లపై ఆధారపడే నగరంగా కాకుండా స్వయం సంవృద్ధి ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మెట్రోపాలిటన్ కమిషనర్ ఎన్.తేజ్‌భరత్ తెలిపారు. ఎంఏయూడీ ప్రధాన కార్యదర్శి ఎస్.సురేష్‌కుమార్ నేతృత్వంలో ఉన్నత స్థాయి బృందం రెండు రోజుల అధ్యయన పర్యటనలో భాగంగా ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)ను సందర్శించింది. ఇందులో ప్రాంతీయ పాలన, భూమి ఆధారిత ఫైనాన్సింగ్, ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్‌మెంట్, మురికివాడల పునర్వికాసం, విస్తృత స్థాయి నగర నిర్మాణానికి సంబంధించి దేశంలో అత్యంత అభివృద్ధి చెందిన వ్యవస్థలపై అధ్యయనం చేశారు. ఈ పర్యటనకు వీఎంఆర్‌డీఏ నుంచి కమిషనర్‌తో పాటు జాయింట్ కమిషనర్ కె.రమేష్, సీఈ భవానీశంకర్, సీయూపీ వి.శిల్ప, పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెట్రోపాలిటన్ కమిషనర్ తేజ్‌భరత్ మాట్లాడుతూ ముంబై నమూనా ఒక నగరాన్ని దీర్ఘకాలిక ఆర్థిక ఇంజన్‌లుగా ఎలా మార్చగలదో చేపిస్తుందని తెలిపారు. అదే ప్రతిపాదికన విశాఖ ఎకనామిక్ రీజియన్‌కు రూపకల్పన చేస్తున్నామని, తద్వారా విశాఖ స్వయం సమృద్ధిని సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


