నాడు అన్నీ.. నేడు వట్టి బియ్యమే!
రేషన్ పంపిణీపై నీలినీడలు సగం మందికే రాగి పిండి సంక్రాంతి పండగకు కందిపప్పు నిల్ వైఎస్సార్‌సీపీ పాలనలో పేదలకు పుష్కలంగా సరుకులు
మహారాణిపేట: జిల్లాలో ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) అమలు తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు అందే రేషన్ సరుకుల్లో కోతలు విధిస్తూ, అరకొర సరఫరాతో కాలక్షేపం చేస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎన్నికల సమయంలో కందిపప్పు, వంటనూనె, రాగిపిండి వంటి అనేక రకాల నిత్యావసరాలను అందిస్తామని ఇచ్చిన హామీలు నేటికీ అమలుకు నోచుకోలేదు. గత 18 నెలల కాలంలో కేవలం రెండుసార్లు మాత్రమే కందిపప్పు పంపిణీ చేసి, ప్రస్తుతం కేవలం బియ్యం, పంచదారతోనే సరిపెడుతున్నారు. సంక్రాంతి పండగ వేళ కూడా పప్పు సరఫరా చేయకపోవడంతో పేద ప్రజలు ఉసూరమంటున్నారు.
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో..
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి కార్డుదారునికి నెలకు ఒక కిలో కందిపప్పును రూ. 70లకే అందించేవారు. మార్కెట్‌లో కందిపప్పు ధరలు సామాన్యులకు భారంగా మారిన తరుణంలో, రేషన్ డిపోల ద్వారా అందే పప్పుపైనే అనేక కుటుంబాలు ఆధారపడేవి. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. అటు గోధుమ పిండి పంపిణీలోనూ ప్రభుత్వం వివక్ష చూపుతోందన్న విమర్శలు వస్తున్నాయి. కేవలం పట్టణ ప్రాంతాలకే గోధుమ పిండిని పరిమితం చేసి, గ్రామీణ ప్రాంత కార్డుదారులను విస్మరించడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. జనవరి నెలకు సంబంధించి సిటీ పరిధిలోని 504 దుకాణాలకు మాత్రమే 320 మెట్రిక్ టన్నుల గోధుమ పిండిని కేటాయించారు.
అరకొర సరుకులు
జిల్లా వ్యాప్తంగా మొత్తం 5,17,619 తెల్ల కార్డులు, 625 చౌకధరల దుకాణాలు ఉన్నప్పటికీ, సరుకుల సరఫరా మాత్రం కార్డుల సంఖ్యకు అనుగుణంగా ఉండటం లేదు. అరకొరగా సరుకులు పంపిణీ చేస్తుండటంతో అటు కార్డుదారులు, ఇటు డీలర్లు గందరగోళానికి గురవుతున్నారు. ఒకవైపు జిల్లా సప్లయి అధికారి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో అధికారులు పర్యవేక్షిస్తున్నా, క్షేత్రస్థాయిలో సరుకుల లభ్యత మాత్రం మెరుగుపడటం లేదు. పండుగ వేళ పూర్తిస్థాయిలో నిత్యావసరాలు అందించకుండా ప్రభుత్వం పబ్బం గడుపుకుంటోందని జిల్లా ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.


