మయూర్ అశోక్ సేవలు ప్రశంసనీయం
మహారాణిపేట: అద్భుతమైన పనితీరుతో అందరి మనసులు గెలుచుకున్న జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్ సేవలు ప్రశంసనీయమని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ కొనియాడారు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా బదిలీపై వెళ్తున్న జేసీ మయూర్ అశోక్ దంపతులకు రెవెన్యూ అసోసియేషన్, జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో వీడ్కోల సభ మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు, వివిధ విభాగాల సిబ్బంది మయూర్ అశోక్, ఆయన భార్య జీసీసీ ఎండీ కల్పనా కుమారిలను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్లిష్టమైన సమస్యల పరిష్కారంలో మయూర్ అశోక్ చురుకై న పాత్ర పోషించారని, మంచి వ్యక్తిత్వం, నిబద్ధత కలిగిన అధికారిగా ప్రత్యేక గుర్తింపు పొందారని అన్నారు. ఐటీ కంపెనీలకు భూ కేటాయింపులు, సాంకేతిక అంశాల్లోనూ చురుగ్గా వ్యవహరించారని తెలిపారు. విధి నిర్వహణలో తనకు ఒక సోదరుడిలా వెన్నుదన్నుగా నిలిచారని పేర్కొన్నారు. అరకు కాఫీకి ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురావడంలో జీసీసీ ఎండీ కల్పనా కుమారి కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ఆమె పార్లమెంట్‌లో అరకు కాఫీ స్టాల్ ఏర్పాటు చేయించారని గుర్తు చేశారు. తక్కువ కాలంలోనే జీసీసీలో అనేక సంస్కరణలు తీసుకువచ్చారని ప్రశంసించారు.
ఉత్తరాంధ్ర కుటుంబం నుంచి దూరమవుతున్నా..
జేసీ మయూర్ అశోక్ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర జిల్లాల్లో సుమారు నాలుగేళ్ల పాటు పనిచేసిన అనుభవం మరువలేనిదన్నారు. విశాఖతో ప్రత్యేక అనుబంధం ఏర్పడిందని చెప్పారు. ఉత్తరాంధ్ర కుటుంబం నుంచి దూరమవుతున్నందుకు బాధగా ఉందన్నారు. కలెక్టర్ హరేందిర ప్రసాద్ మార్గదర్శకత్వం, సహకారం ఎప్పటికీ గుర్తుండిపోతుందని, అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. జీసీసీ ఎండీ కల్పనా కుమారి మాట్లాడుతూ ఉత్తరాంధ్ర జిల్లాల్లో వివిధ బాధ్యతలు నిర్వహించే అవకాశం లభించిందని, విశాఖలో హౌసింగ్ జేసీగా పనిచేసిన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. అన్ని విభాగాల అధికారుల సహకారం మరువలేనిదని తెలిపారు. కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్, ఆర్డీవోలు సుధాసాగర్, సంగీత్ మాధుర్, హౌసింగ్ పీడీ సత్తిబాబు, కలెక్టరేట్ ఏవో రాణి, రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు త్రినాథ్, కార్యదర్శి శ్యాంప్రసాద్, వీఆర్వో అసోసియేషన్, రేషన్ దుకాణాల అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు పి.చిట్టిరాజు, మాకిన ప్రసాద్, జీవీఎంసీ, వీఎంఆర్డీఏ, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


