గూడు చెదిరిన వలస పక్షులు
చిట్టివలస చెరువులో అల్పసంఖ్యాకంగా కనిపిస్తున్న పక్షులు
తగరపువలస: జీవీఎంసీ భీమిలి జోన్ 1, 2 వార్డుల పరిధిలోని చిట్టివలస, చిల్లపేట గ్రామాల మధ్య 36 ఎకరాలలో విస్తరించిన చెరువు గతంలో వలస పక్షులకు ఆలవాలంగా ఉండేది. చిత్తడి నేలల రకానికి చెందిన ఈ చెరువులో పీఎం పాలేనికి చెందిన ఈస్ట్‌కోస్ట్ కన్జర్వేషన్ టీమ్, గ్రీన్ పా ప్రతినిధులు గతంలో 35 రకాల పక్షిజాతులను గుర్తించారు. వాటిలో నీటి కోడి, పావురాలు, కొంగలు, మునుగుడు కోడి, జెముడుకాకులు, తాటి చతకా, కుకూడు, నీటికాకులు, చిలకలు, మైనాలు, కత్తెర పిట్టలు, జకన, ఉల్లంకి పిట్టలు తదితర పక్షులు ఉండేవి. భూసారం, ఇసుక నేలలు, డ్రైనేజీ నిల్వలు, రసాయన వ్యవసాయం, నీటి పారుదల, పట్టణ వ్యర్థాలు, కాలుష్యం పక్షుల మనుగడపై ప్రభావం చూపాయి. ఇటీవల జీవీఎంసీ చెరువులో పక్షులు సంతానోత్పత్తిలో భాగమైన చెట్లు, తుప్పలు తొలగించింది. అలాగే సంగివలస అనిల్ నీరుకొండ మెడికల్ కళాశాల, ఆసుపత్రి నుంచి వ్యర్థాలు నేరుగా చెరువులో కలవడం కూడా వీటి మనుగడపై ప్రభావం చూపింది. దీంతో తగరపువలస–భీమిలి రోడ్డులో నిత్యం ప్రయాణికులు, పర్యాటకులను పలకరించే పక్షులు ఇప్పుడు పలచబడ్డాయి. ఈ చెరువును వలస పక్షులకు ఆలవాలంగా మార్చాలని పక్షి ప్రేమికులు కోరుతున్నారు.
గూడు చెదిరిన వలస పక్షులు
గూడు చెదిరిన వలస పక్షులు
గూడు చెదిరిన వలస పక్షులు


