నేడు సింహగిరిపై సంక్రాంతి సంబరాలు
సింహాచలం: సింహగిరిపై బుధవారం ఉదయం సంక్రాంతి సంబరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. హిందూ సనాతన ధర్మాన్ని, తెలుగు సంస్కృతిని, గ్రామీణ జీవన విధానాన్ని ప్రతిబింబించేలా ఈ వేడుకలను తీర్చిదిద్దారు. రాజగోపురం ఎదురుగా ఉన్న మాడ వీధిలో తెల్లవారుజామున పెద్ద ఎత్తున భోగి మంటలు వేసేందుకు ఏర్పాట్లు చేయగా, గొబ్బెమ్మలతో కూడిన ముత్యాల ముగ్గులు, డూడూ బసవన్నల విన్యాసాలు భక్తులను అలరించనున్నాయి. వీటితో పాటు జంగమ దేవర, కొమ్మదాసరి, హరిదాసు వేషధారణలు, కపిలగోవు, కపిలగిత్త, ఎడ్లబండి మరియు పూరిగుడిసెల ప్రదర్శనలు పల్లె వాతావరణాన్ని తలపించనున్నాయి. వేడుకల్లో భాగంగా గోపూజను నిర్వహించడంతో పాటు, ఉదయం 9 గంటలకు చిన్నారులకు సామూహికంగా భోగిపళ్లు పోసే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఈ వేడుకల కోసం రాజగోపురం మార్గాన్ని శోభాయమానంగా అలంకరించారు.


