జీవీఎంసీ పీజీఆర్‌ఎస్‌కు 81 వినతులు
డాబాగార్డెన్స్: జీవీఎంసీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో 81 వినతులను కమిషనర్ కేతన్ గార్గ్, అదనపు కమిషనర్లు డీవీ రమణమూర్తి, ఎస్‌ఎస్ వర్మ స్వీకరించారు. వీటిలో అత్యధికంగా పట్టణ ప్రణాళికా విభాగానికి సంబంధించి 51 ఫిర్యాదులు అందాయి. మిగిలిన వాటిలో ఇంజినీరింగ్ సెక్షన్‌కు 11, రెవెన్యూకి 7, పరిపాలన అండ్ అకౌంట్స్ విభాగానికి 6, ప్రజారోగ్య విభాగానికి 5, ఉద్యానవన విభాగానికి ఒక వినతి వచ్చాయి. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అందిన ప్రతి అర్జీపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, నాణ్యమైన పరిష్కారం చూపాలని ఆదేశించారు.
పురమిత్ర యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి..
నగర ప్రజల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ’పురమిత్ర’యాప్‌ను ప్రజలు విరివిగా వినియోగించు కోవాలని కమిషనర్ కేతన్ గార్గ్ సూచించారు. మౌలిక సదుపాయాలు, ఇతర పౌర సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు ప్రజలు నేరుగా కార్యాలయాలకు రానవసరం లేకుండా, ఈ యాప్ ద్వారా తమ వినతులను సమర్పించవచ్చని తెలిపారు. దీనివల్ల ప్రజలకు సమయం ఆదా అవ్వడమే కాకుండా, సమస్యలు కూడా వేగంగా పరిష్కారమవుతాయని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో జీవీఎంసీ ప్రధాన ఇంజినీర్ సత్యనారాయణరాజు, ప్రధాన వైద్యాధికారి నరేష్ కుమార్, సీసీపీ ప్రభాకరరావు, డీసీఆర్ శ్రీనివాసరావు, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ వాసుదేవరెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.


