కళ్లెదుటే తల్లి మృతి
తాటిచెట్లపాలెం: ద్వారకా పోలీస్ స్టేషన్ పరిధిలోని రామాటాకీస్ రోడ్డులో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు కిందపడి ఓ మహిళ అక్కడికక్కడే దుర్మరణం చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సీతమ్మధారకు చెందిన బొంగు రమణి (56) అనారోగ్యం కారణంగా తన కుమారుడు అశోక్ కుమార్‌తో కలిసి ద్విచక్రవాహనంపై నగరంలోని ఓ ఆసుపత్రికి వెళ్లారు. చికిత్స అనంతరం తిరిగి సీతమ్మధారలోని తమ ఇంటికి వెళ్తుండగా.. రామాటాకీస్ రోడ్డులో వస్తున్న ఆర్టీసీ బస్సు వారి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ క్రమంలో ద్విచక్రవాహనం వెనుక కూర్చున్న రమణి ఒక్కసారిగా కిందపడిపోగా, బస్సు వెనుక చక్రాలు ఆమె తలపై నుంచి వెళ్లాయి. దీంతో ఆమె తల భాగం నుజ్జునుజ్జయి అక్కడికక్కడే మృతి చెందింది. కళ్లెదుటే తల్లి విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి కుమారుడు అశోక్ కన్నీరుమున్నీరుగా విలపించడం చూసి స్థానికులు చలించిపోయారు. సమాచారం అందుకున్న ద్వారకా ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


