ఇంటి పన్నులు వేయించండి మహాప్రభో..
పెందుర్తి నియోజకవర్గం చింతగట్ల గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 28లో నివసిస్తున్న 78 కుటుంబాలు, గత ఎనిమిదేళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యలపై సోమవారం గళమెత్తారు. తాము ఇక్కడ ఇళ్లు నిర్మించుకుని ఉంటున్నప్పటికీ, పంచాయతీ అధికారులు తమకు ఇంటి పన్ను రశీదులు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అనుచరుల ఒత్తిడి వల్లే అధికారులు పన్నులు వేయడం లేదని, వారి అడ్డుతగిలే ధోరణితో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని బాధితులు ఆరోపించారు. ఈ సమస్యపై సోమవారం పీజీఆర్‌ఎస్‌లో వీరంతా వినతిపత్రాలు సమర్పించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఇంటి పన్నులు వేయడానికి పంచాయతీ సిబ్బంది సిద్ధంగా ఉన్నప్పటికీ, రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే వెనుకంజ వేస్తున్నారని వారు వాపోయారు. పన్ను రశీదులు లేకపోవడం వల్ల విద్యుత్ మీటర్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవసరమైన సర్టిఫికెట్లు కూడా అధికారులు ఇవ్వడం లేదని, దీనివల్ల చీకట్లోనే మగ్గాల్సి వస్తోందని బాధితులు మొరపెట్టుకున్నారు.


