స్టీల్‌ప్లాంట్‌లో ఉత్కంఠగా మాక్‌డ్రిల్
ఉక్కునగరం : స్టీల్‌ప్లాంట్‌లో గ్యాస్ బూస్టింగ్ స్టేషన్–2ఎం వద్ద ఉన్న ఎల్‌పీ బూస్టర్–1 నుంచి కోక్ ఓవెన్ గ్యాస్ లీకై , మంటలు చెలరేగినట్లు సంకేతాలు అందడంతో అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు సమాచారం అందడంతో ఆయా విభాగాల సిబ్బంది యుద్ధప్రాతిపదికన స్పందించారు. ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్ విభాగం, గ్యాస్ సేఫ్టీ, సీఐఎస్‌ఎఫ్ ఫైర్, వైద్య , భద్రతా సిబ్బంది, హెచ్‌ఆర్, వాటర్ మేనేజ్‌మెంట్ విభాగాలకు చెందిన అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న ఇద్దరిని తక్షణమే సురక్షిత ప్రాంతానికి తరలించి ప్రథమ చికిత్స అందించడంతో పాటు, గ్యాస్ లీకేజీని అరికట్టేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. అయితే ఇదంతా ప్రమాద సమయాల్లో సిబ్బంది పనితీరును పరీక్షించేందుకు నిర్వహించిన మాక్‌డ్రిల్ అని తెలియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రాష్ట్ర ఫ్యాక్టరీ విభాగం జాయింట్ చీఫ్ ఇన్‌స్పెక్టర్ జె. శివశంకరరెడ్డి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్లాంట్‌లోని వివిధ విభాగాల ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


