వేదన నుంచి వేదనాదం వరకు.. | - | Sakshi
Sakshi News home page

వేదన నుంచి వేదనాదం వరకు..

Jan 13 2026 5:38 AM | Updated on Jan 13 2026 5:38 AM

వేదన

వేదన నుంచి వేదనాదం వరకు..

● హరినామంలో మహిళా స్వరం ● హరిదాసిగా రాణిస్తున్న నాగమణి ● భర్త ఆశయం కోసం అక్షయపాత్ర పట్టిన ఇల్లాలు

డాబాగార్డెన్స్‌: తెలుగువారి లోగిళ్లలో సంక్రాంతి సందడి అంటేనే హరినామ స్మరణ. నెల రోజుల పాటు సాగే ఈ ధనుర్మాస ఉత్సవాల్లో అక్షయపాత్రను నెత్తిన మోస్తూ, చిడతల సవ్వడితో, తంబురా మీటుతూ వచ్చే హరిదాసులను సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి స్వరూపంగా భక్తులు భావిస్తారు. తరతరాలుగా పురుషులు మాత్రమే నిర్వహిస్తూ వస్తున్న ఈ పవిత్ర వృత్తిలో, విధి ఆడిన వింత నాటకంలో ఒక సామాన్య మహిళ ‘హరిదాసి’గా మారి అరుదైన బాటను ఎంచుకుంది..నగరానికి చెందిన కందుల నాగమణి. భర్త మరణానంతరం ఆయన వదిలివెళ్లిన భక్తి వారసత్వాన్ని, కుటుంబ బాధ్యతను భుజాన వేసుకుని ఆమె చేస్తున్న ఈ ప్రయాణం ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తోంది.

భక్తి సామ్రాజ్యంలో ...

సాధారణంగా హరిదాసులంటే కాషాయ వస్త్రాలు, నుదుట తిరునామాలు, తలపై అక్షయపాత్రతో కనిపిస్తారు. ఇది పురందరదాసు, కనకదాసుల కాలం నుంచి వస్తున్న గొప్ప సంప్రదాయం. హరిదాసుల గానామృతం కేవలం ఆధ్యాత్మిక చింతననే కాకుండా, సామాజిక చైతన్యాన్ని కూడా కలిగిస్తుంది. ఇన్నాళ్లూ పురుషులకే పరిమితమైన ఈ రంగంలోకి నాగమణి అడుగుపెట్టడం వెనుక ఒక కన్నీటి గాథ, అంతకు మించిన గుండె నిబ్బరం ఉన్నాయి. జీవీఎంసీ 50వ వార్డు పరిధిలోని సాయిరామ్‌నగర్‌లో నివసించే నాగమణి భర్త కందుల చంద్రం, గతంలో బ్రాండిక్స్‌ కంపెనీలో బస్సు డ్రైవర్‌గా పని చేస్తూనే, ఏటా ధనుర్మాసంలో హరిదాసుడుగా మారి భక్తిని పంచేవారు. భర్త కీర్తనలు పాడుతుంటే పరవశించిపోయే నాగమణి, ఆయనతో పాటే ఆ ఆధ్యాత్మిక గీతాలను నేర్చుకుంది. 2018లో గుండెపోటుతో చంద్రం మృతి చెందడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది.

అధైర్యపడని ఆత్మవిశ్వాసం

భర్త చనిపోయిన తర్వాత ఇద్దరు ఆడపిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. కానీ నాగమణి కుంగిపోలేదు. భర్త పనిచేసిన కంపెనీలోనే స్టిచింగ్‌ ఆపరేటర్‌గా చేరి పిల్లల్ని చదివిస్తోంది. పెద్ద కుమార్తె చంద్రిక పదో తరగతి, చిన్న కుమార్తె వైష్ణవి ఎనిమిదో తరగతి చదువుతున్నారు. అయితే కేవలం ఆర్థిక అవసరాలే కాకుండా, తమకు మగపిల్లలు లేరనే వెలితి రాకూడదని, తన భర్త కొనసాగించిన కులవృత్తి ఆగిపోకూడదని నాగమణి దృఢ నిశ్చయానికి వచ్చింది. ఆ సంకల్పమే ఆమెను ‘హరిదాసి’గా మార్చింది. తన భర్త గతంలో ఏ ఏ వీధుల్లో అయితే హరినామ స్మరణ చేశారో, సరిగ్గా అదే ప్రాంతాల్లో ఇప్పుడు నాగమణి తంబురా పట్టుకుని కనిపిస్తుంటే స్థానికులు ఆశ్చర్యంతో పాటు అభినందనలు కురిపిస్తున్నారు.

కఠినమైన నిష్ట.. నిరంతర నామస్మరణ

ధనుర్మాసం మొదలవగానే నాగమణి దినచర్య ఎంతో కఠినంగా ఉంటుంది. తెల్లవారుజామున 4 గంటలకే నిద్రలేచి, స్నానపానాలు ముగించుకుని, దైవ ప్రార్థన అనంతరం హరిదాసి వేషధారణలో సిద్ధమవుతుంది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం వరకు విరామం లేకుండా సాయిరామ్‌నగర్‌, మురళీనగర్‌, పట్టాభిరెడ్డి గార్డెన్స్‌ వంటి ప్రాంతాల్లో కీర్తనలు పాడుతూ భక్తులను ఆశీర్వదిస్తోంది. హరిదాసుల సంప్రదాయం ప్రకారం తలపై ఉన్న అక్షయపాత్రను ఇంటికి వెళ్లే వరకు కింద పెట్టకూడదు. ఒకవేళ భక్తులు ఇచ్చే బియ్యం, కానుకలతో పాత్ర నిండిపోతే, ఒక రాయిపై దించి సంచిలోకి మార్చుకుంటారు. తిరిగి ఇంటికి చేరుకున్నాకే అక్షయపాత్రను దేవుడి మూల ఉంచి, పూజ నిర్వహించి అప్పుడు భోజనం స్వీకరిస్తారు.

చేయూత కోసం ఎదురుచూపు

ఆర్థిక ఇబ్బందులు వెన్నాడుతున్నా నాగమణి ఆత్మగౌరవంతో ముందుకు సాగుతోంది. సొంతంగా తంబురా కొనుగోలు చేసే స్తోమత లేక ఇతరుల నుంచి తీసుకుని వాడుతోంది. స్థానిక దాత పైలా దేముడు నాయుడు ఆమెకు 7 కేజీల రాగి పాత్రను బహూకరించి తన వంతు సాయం అందించారు. ‘భర్త నేర్పిన విద్యను, మా కుటుంబ సంప్రదాయాన్ని కాపాడుకోవడమే నా లక్ష్యం. పిల్లల చదువుల కోసం, నా వృత్తి కోసం ఎవరైనా దాతలు సహకరిస్తే కృతజ్ఞతతో ఉంటాను’ అని నాగమణి విజ్ఞప్తి చేస్తోంది. ఒకవైపు ఉద్యోగం చేస్తూ, మరోవైపు అంతరించిపోతున్న కళారూపాన్ని మహిళగా భుజాన మోస్తున్న నాగమణి నిజంగానే అభినందనీయురాలు.

వేదన నుంచి వేదనాదం వరకు..1
1/1

వేదన నుంచి వేదనాదం వరకు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement