● విశాఖలో వరుసగా అతివలపై దాడులు ● మహిళలే లక్ష్యంగా చో
సాక్షి, విశాఖపట్నం : చంద్రబాబు ప్రభుత్వ హయాంలో మహిళల భద్రత గాల్లో దీపమే అని ఈ ఘటనలు మరోసారి రుజువు చేశాయి. మహిళల భద్రతకు పెద్దపీట వేశామంటూ సీఎం చంద్రబాబు, హోంమంత్రి మైక్ దొరికిన ప్రతిసారీ ఊదరగొడుతున్నా.. క్షేత్ర స్థాయిలో మాత్రం అవన్నీ ఒట్టిమాటలే అని తేల్చేస్తూ వరుస ఘటనలు.. విశాఖలో మహిళా లోకాన్ని కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అత్యంత రద్దీ ఉన్న ప్రాంతంలో భద్రతను పెంచాలన్న కనీస చర్యలు చేపట్టలేకపోవడం దురదృష్టకరం.
పట్టపగలే మహిళలే టార్గెట్‌గా..
మహిళల్నే టార్గెట్ చేస్తూ దొంగతనాలు జరుగుతున్నాయి. అంతా జరిగిన తర్వాత బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు కేసులు ఛేదిస్తున్నారే తప్ప.. ముందస్తు చర్యలు చేపట్టడం, భద్రత విషయంలో కఠినంగా వ్యవహరించడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. గత సెప్టెంబర్ నెలలో ఒకే రోజున నగరంలోని కంచరపాలెం, వన్‌టౌన్, గాజువాక తదితర ఏడు ప్రాంతాల్లో మహిళల మెడలో గొలుసులు దొంగతనాలు జరిగాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అక్టోబర్ నెలలో కంచరపాలెం సమీపంలో అర్ధరాత్రి ఓ ఇంటిలో ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై దాడి చేసి కట్టేసి 12 తులాల బంగారం, నగదు దోచుకెళ్లారు.
ఇతర రాష్ట్రాల నుంచి ముఠాలు
ఉత్తరప్రదేశ్, ఇతర రాష్ట్రాల నుంచి బవారియా వంటి అంతర్రాష్ట్ర ముఠాలు విశాఖను టార్గెట్ చేసినా.. పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టడంలో విఫలమయ్యారన్న వాదన బలంగా వినిపిస్తోంది. కేవలం రోడ్లమీదే కాదు.. ఇంట్లో ఉన్న మహిళలకు రక్షణ లేకుండా పోతోందనే ఆరోపణలొస్తున్నాయి. రాజకీయ విమర్శలు, రాజకీయ కక్షతో అరెస్టులకు ప్రాధాన్యమిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం.. మహిళల రక్షణపై కనీస శ్రద్ధ కూడా చూపించడం లేదంటూ మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వంలో మహిళలపై దాడులు కొత్తేం కాదు. 2014–19లో చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో పెందుర్తి మండలం 2017 డిసెంబర్ నెలలో ఓ దళిత మహిళని వివస్త్ర చేసి టీడీపీ నాయకులే విచక్షణ రహితంగా దాడి చేసిన ఘటన.. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం విదితమే. మళ్లీ అదే తరహా సంస్కృతి విశాఖలో విషతుల్యంగా మారకముందే.. చంద్రబాబు ప్రభుత్వం మహిళా భద్రతపై మరింత కఠినంగా వ్యవహిరంచాలంటూ పలువురు కోరుతున్నారు.


