కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వం దాసోహం
అప్పలరాజుపై పీడీ యాక్ట్ ఎత్తివే యాలి
సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింగరావు
బీచ్‌రోడ్డు: రైతు సంఘం నాయకుడు ఎం.అప్పలరాజుపై రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా ప్రయోగించిన పీడీ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.హెచ్. నరసింగరావు డిమాండ్ చేశారు. అప్పలరాజును బేషరతుగా విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆదివారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో నరసింగరావు మాట్లాడారు. అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు చేస్తున్న బల్క్ డ్రగ్ పార్క్ వల్ల మత్స్యకారులు, రైతులు తమ భూములతో పాటు జీవనోపాధిని కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందనే ఆందోళనతో ప్రజలు న్యాయబద్ధంగా పోరాడుతుంటే, ప్రభుత్వం పోలీసు బలగాలతో ఉద్యమాన్ని అణచివేయాలని చూడటం దుర్మార్గమని మండిపడ్డారు. దీనిని ప్రశ్నించినందుకే అప్పలరాజుపై 19 అక్రమ కేసులు బనాయించారని, డిసెంబర్ 24న అరెస్ట్ చేసి పీడీ యాక్ట్ కింద జైలుకు పంపడం ప్రజాస్వా మ్యాన్ని ఖూనీ చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐటీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.ఎం.శ్రీనివాస్, ఆర్.కె.ఎస్.వి.కుమార్, జిల్లా నాయకులు పి.మణి, డాక్టర్ బి. గంగారావు, పి.వెంకటరావు, సీతా లక్ష్మి, చంద్రశేఖర్ పాల్గొన్నారు.


