మళ్లీ ఎటో.. | - | Sakshi
Sakshi News home page

మళ్లీ ఎటో..

Jan 12 2026 6:28 AM | Updated on Jan 12 2026 6:28 AM

మళ్లీ

మళ్లీ ఎటో..

మెట్రో ప్రాజెక్టు సాధ్యమేనా అనే అనుమానాలు మరోసారి సాధ్యాసాధ్యాల రిపోర్ట్‌ ఇవ్వాలన్న కేంద్రం గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఫీజిబిలిటీ రిపోర్ట్‌, డీపీఆర్‌ పూర్తి డీపీఆర్‌ ఆమోదించే సమయంలో వద్దని చెప్పిన చంద్రబాబు సర్కారు మార్పులు చేర్పులు చేస్తామంటూ హడావుడి డీపీఆర్‌ ఆమోదించకుండానే టెండర్లు పిలిచిన ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ ఫీజబులిటీ రిపోర్ట్‌ అడిగిన కేంద్రం చంద్రబాబు ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో గాల్లో దీపంలా మెట్రో ప్రాజెక్ట్‌

వైజాగ్‌ మెట్రో..

వైజాగ్‌ మెట్రో రైలు ప్రాజెక్టు నమూనా

సాక్షి, విశాఖపట్నం :

ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించడమెలాగో చంద్రబాబు ప్రభుత్వానికి వెన్నతో పెట్టిన విద్యగా మారింది. ఇదిగో పులి అంటూ చంద్రబాబు అంటే.. అదిగో తోక అంటూ టీడీపీ భజన బృందం హడావుడి చేయడం షరామాములుగా మారిపోయింది. డీపీఆర్‌కు కేంద్రం ఆమోదముద్ర వెయ్యకుండానే టెండర్లు పిలిచి.. అభాసుపాలైన ప్రభుత్వం.. చివరికి వైజాగ్‌ మెట్రో ప్రాజెక్టును గాల్లో దీపంలా మార్చేసింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఫీజిబిలిటీ రిపోర్టు పూర్తై డీపీఆర్‌ ఆమోదం చివరి దశకు చేరుకున్న తరుణంలో.. డీపీఆర్‌లో మార్పులు చేస్తామంటూ చంద్రబాబు సర్కారు మోకాలడ్డింది. ఇప్పుడు గతంలో ఇచ్చిన ఫీజిబిలిటీ రిపోర్టు సరిపోదని..మళ్లీ కొత్తది ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వం మరోసారి ఆదేశించడంతో ప్రాజెక్టు అటా.. ఇటా.. అనే సందేహాలు అందరిలోనూ మొదలయ్యాయి.

మహా విశాఖ మరింత అభివృద్ధి చెందేందుకు గత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తూ.. లైట్‌మెట్రో ప్రాజెక్టు పట్టాలక్కెంచేందుకు రోడ్‌ మ్యాప్‌ సిద్ధం చేసింది. 76 కిలోమీటర్ల మేర 4 కారిడార్లతో నిర్మించనున్న తొలి విడత ప్రాజెక్టుకు రూ.14,309 కోట్లు వ్యయం అవుతుందని స్పష్టం చేస్తూ 2023 డిసెంబర్‌ 29న ఉత్తర్వులు సైతం జారీ చేసింది. పీపీపీ విధానంలో చేపట్టబోయే ఈ ప్రాజెక్టులో ప్రభుత్వాల వాటా 40 శాతం కాగా, టెండరు దక్కించుకున్న సంస్థ 60 శాతం భరించనున్నట్లు ఉత్తర్వుల్లో పొందుపరిచారు. 2024 జనవరిలో కేంద్ర ప్రభుత్వానికి డీపీఆర్‌ని కూడా పంపించారు. అయితే.. ప్రభుత్వం మారిపోవడం.. విశాఖను అభివృద్ధి చెయ్యడం అంతగా ఇష్టం లేనట్లు వ్యవహరిస్తున్న చంద్రబాబు.. మెట్రో ప్రాజెక్టుకి మోకాలడ్డే ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. మరోసారి డీపీఆర్‌ తయారు చేస్తామంటూ పాత డీపీఆర్‌ని పక్కన పడేశారు. దీంతో.. కథ మళ్లీ మొదటికొచ్చింది. అయితే పాత డీపీఆర్‌కే స్వల్ప మార్పులు చేసి హడావుడి చేసింది. మెట్రోని మరింత జాప్యం చేసేందుకు భూ సర్వే చెయ్యాలంటూ జిల్లా అధికారుల్ని ఆదేశించారు. అంతా పూర్తయిన తర్వాత ఇప్పుడు ప్రాజెక్టు పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోయింది.

మరోసారి ఫీజిబిలిటీ పేరుతో కొర్రీ

పాత డీపీఆర్‌నే అటు ఇటుగా మార్చేసి.. ఆలస్యంగా రాష్ట్రప్రభుత్వం సమర్పించిన డీపీఆర్‌ మీద కేంద్రం కొత్త కొర్రీ వేసినట్లు తెలుస్తోంది. రూ.14,309 కోట్లుతో రూపొందించిన ఈ ప్రాజెక్ట్‌కు ఫీజిబిలిటీరిపోర్టు మళ్లీ ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకసారి రూపొందించిన ఫీజిబిలిటీ రిపోర్టు పదేళ్ల పాటు వ్యాలిడిటీ ఉంటుంది. విభజన హామీలో మెట్రో ప్రాజెక్టు ఉండటంతో 2014–15లో రూపొందించిన ఫీజిబిలిటీ రిపోర్టు వ్యాలిడిటీ 2025కి పూర్తయింది. దీంతో.. కొత్తగా సాధ్యాసాధ్యాల నివేదిక కచ్చితంగా ఇవ్వాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందుకోసం మరోసారి సర్వే చేపట్టాల్సిన అవసరం ఉంది. ఇందుకు రూ.కోట్లు ఖర్చు చెయ్యాల్సి ఉంటుంది. అదే.. 2024 జనవరిలో ఇచ్చిన డీపీఆర్‌ ఆమోదించి ఉంటే.. ఫీజిబిలిటీ రిపోర్టు మరోసారి చెయ్యాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ.. చంద్రబాబు ప్రభుత్వం.. జాప్యం చెయ్యడం వల్ల.. ప్రాజెక్టు మళ్లీ మొదటికొచ్చింది.

ఫ్లైఓవర్లతో సరిపెట్టేద్దామా.?

మరోవైపు విశాఖలోని రద్దీ జంక్షన్లలో ఫ్లైఓవర్లు నిర్మించాలన్న ప్రతిపాదనలు పెరుగుతున్నాయి. కీలకమైన కూడళ్ల వద్ద.. ఫ్లైఓవర్లు ఏర్పాటు చేస్తే.. ట్రాఫిక్‌ ఇబ్బందులు దాదాపుగా తగ్గుతాయనే అభిప్రాయం అటు అధికారుల్లోనూ ఇటు ప్రజాప్రతినిధుల్లోనూ ఉంది. అయితే.. మెట్రో రైలుకు.. ఫ్లై ఓవర్లకు వేరువేరుగా నిర్మాణం చేయడం వల్ల ఆర్ధిక భారం పెరగడంతో పాటు రహదారుల విస్తరణ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రభుత్వ పునరాలోచనలో పడింది. ఇప్పుడు దీనిపైనా సమాలోచనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. పలు ప్రధాన నగరాల్లో మెట్రో నష్టాలతో నడుస్తున్న నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం.. దాన్నే బూచిగా చూపించి.. వైజాగ్‌కు మెట్రో ప్రాజెక్టు లేకుండా చెయ్యాలనే కుట్రలు పన్నుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

టెండర్లకు అతీగతి లేదు

విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టుకు కూటమి ప్రభుత్వం గతేడాది జూలై 25న టెండర్లు పిలిచింది. మొదటి దశలో 46.23 కిలోమీటర్ల మేర మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు రూ.6250 కోట్లు(జీఎస్‌టీ అదనం)తో టెండర్లుకు ఆహ్వానించింది. ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.11,498 కోట్లు కాగా.. మూడు కారిడార్లలో ఫేజ్‌ –1 పనుల కోసం ఈపీసీ ప్రాతిపదికన ఏఎంఆర్‌సీ టెండర్‌ షెడ్యూల్‌ విడుదల చేసింది. కాగితాలపై ఉన్న ప్రాజెక్టు నిర్మించేందుకు ఏ సంస్థా అడుగు ముందుకేసి టెండర్లలో పాల్గొనేందుకు సాహసించలేదు. దీంతో.. పనుల్ని సింగిల్‌ ప్యాకేజీలా కాకుండా.. ప్యాకేజీలుగా విభజించినా ఎవరు రాకపోవడంతో.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు మారింది. మొత్తంగా.. ఏమీ లేకుండానే.. ఏదో చేసేస్తున్నామని డప్పులు కొట్టిన చంద్రబాబు ప్రభుత్వానికి మెట్రో షాక్‌ తగిలింది. ప్రాజెక్టులో ఎలాంటి పురోగతి లేకపోయినా.. టెండర్ల పేరుతో అరచేతిలో మెట్రో చూపించి.. అభాసుపాలైన ప్రభుత్వం.. ఇప్పుడు ఫీజిబిలిటీ షాక్‌తో ఏం చెయ్యాలో పాలుపోక ఆపసోపాలు పడుతోంది.

మళ్లీ ఎటో..1
1/1

మళ్లీ ఎటో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement