● ఆకాశంలో సంబరం.. గాలిలో మృత్యువు
పండగ ఆనందంతో ఊరంతా వెలిగిపోవాల్సిన వేళ, ఒక నిర్లక్ష్యపు దారం మూగజీవి ప్రాణాన్ని నిలువునా బలితీసుకుంది. సంక్రాంతి సంబరాల్లో భాగంగా మనం ఎగురవేసే పతంగాలు మనకు ఉల్లాసాన్ని ఇస్తుండవచ్చు కానీ, ఆ గాలిపటానికి కట్టే నిషేధిత ‘చైనీస్ మాంజా’ పక్షుల పాలిట మృత్యుపాశంగా మారుతోంది. పలు స్వచ్ఛంద సంస్థలు ఎంతగా నెత్తీనోరూ బాదుకుంటున్నా, కొందరి అనాలోచిత చర్యలు ప్రాణాలను హరిస్తూనే ఉన్నాయి. పాతనగరం మెయిన్‌రోడ్డులోని టౌన్‌కొత్తరోడ్డు సిగ్నల్ పాయింట్ వద్ద ఆదివారం హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. కొందరు యువకులు మాంజా దారంతో పతంగులు ఎగురవేస్తుండగా, ఆ ఘాటైన దారం గాలిలో ఎగురుతున్న ఒక పక్షి మెడకు చుట్టుకుంది. తప్పించుకునే దారి లేక, ఆ దారం బిగుసుకుపోవడంతో ఆ పక్షి సిగ్నల్ పాయింట్ వద్దే విలవిల్లాడుతూ ప్రాణాలు విడిచింది. దారి వెంట వెళ్లేవారు గమనించి కాపాడే లోపే ఆ మూగజీవి ప్రాణం నిశ్శబ్దంగా అనంతవాయువుల్లో కలిసిపోయింది. మనిషి ఆనందం కోసం వాడే ఒక వస్తువు, ప్రకృతిలో స్వేచ్ఛగా విహరించే పక్షికి శాపంగా మారింది. అదే వీధిలో కొద్ది దూరంలోనే సంక్రాంతి ముగ్గుల పోటీలు ఎంతో ఉత్సాహంగా సాగుతున్నాయి. రంగురంగుల ముగ్గులు, చిన్నారుల కేరింతలు, పండుగ కోలాహలం ఒకవైపు కనిపిస్తుంటే, మరోవైపు మనిషి స్వార్థానికి బలైన ఒక పక్షి కళేబరం వేలాడుతూ కనిపించడం అక్కడి వారిని కలచివేసింది. ఆనందం, ఆవేదన ఒకే చోట దర్శనమిచ్చిన ఈ దృశ్యం మానవత్వానికే ఒక పరీక్షగా నిలిచింది.
– డాబాగార్డెన్స్/ ఫొటో : సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం


