‘కూటమి వైఫల్యాలను ఎండగడతాం’
మహారాణిపేట: అర్హులైన ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందించి, వారి హృదయాలను గెలుచుకున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెంటే ప్రజలున్నారని వైఎస్సార్ సీపీ ప్రచార విభాగం(ఉత్తరాంధ్ర జోన్–1) వర్కింగ్ ప్రెసిడెంట్ జి.వి.రవిరాజు అన్నారు. శుక్రవారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తనపై విశ్వాసం ఉంచి ఉత్తరాంధ్ర జోన్–1 ప్రచార విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కీలక బాధ్యతలు అప్పగించిన పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేసే అవకాశం దక్కడం సంతోషంగా ఉందన్నారు. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు, గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేసిన మేలును, ప్రజాహిత నిర్ణయాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడమే తన ప్రధాన లక్ష్యమని రవిరాజు స్పష్టం చేశారు. పార్టీ విధానాలు, సిద్ధాంతాలను సమర్థవంతమైన ప్రచార వ్యూహాల ద్వారా ప్రజలకు చేరవేయడంలో ప్రచార విభాగం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అనంతరం ఆయన పార్టీ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజును మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. గాజువాక సమన్వయకర్త తిప్పల దేవన్‌రెడ్డి, రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షుడు ద్రోణంరాజు శ్రీవత్సవ్, జిల్లా ప్రచార విభాగ అధ్యక్షుడు జీలకర్ర నాగేంద్ర, దల్లి రామకృష్ణ రెడ్డి, కోతకాల కుమార్, బొడ్డేటి మహేష్, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.


