ఇద్దరు బెట్టింగ్ రాయుళ్ల అరెస్ట్
విశాఖ సిటీ: అక్రమంగా బెట్టింగ్ యాప్‌లు నిర్వహిస్తూ ప్రజలను మోసం చేస్తున్న ఇద్దరు మోసగాళ్లను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ కేసులో పోలీసులు ఇప్పటికే పలువురిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. వారి నుంచి సేకరించిన సమాచారం మేరకు పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఇందులో పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన మాకిరెడ్డి రాంబాబు(40), మోదిన సత్యహేమ సుబ్రమణ్యమూర్తి(33) అక్రమంగా ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లు మహదేవ్ బుక్, ఇండీబెట్‌లను నిర్వహించడంతో పాటు ఆడుతున్నట్లు గుర్తించారు. క్రికెట్ బెట్టింగ్ వెబ్‌సైట్లలో కమీషన్ కోసం అమాయక ప్రజలకు మంచి లాభాలు వస్తాయని డబ్బు ఆశ చూపించి బెట్టింగ్ ఆడేలా ప్రేరేపిస్తున్నట్లు తెలుసుకున్నారు. సాంకేతికత సహాయంతో వారిపై నిఘా పెట్టి పట్టుకున్నారు. వారిని కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి వారికి 14 రోజుల రిమాండ్ విధించారు. వారి నుంచి క్రికెట్ బెట్టింగ్ కార్యకలాపాలకు వినియోగిస్తున్న మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్, ట్యాబ్‌లను స్వాధీనం చేసుకున్నారు.
ఇద్దరు బెట్టింగ్ రాయుళ్ల అరెస్ట్


