బ్రొకలికి మంచి డిమాండ్
మాది కోటపాడు మండలం, సంతపాలెం. మా పొలంలో పండించిన పంటలను దశాబ్దాలుగా ఎంవీపీ రైతు బజార్‌లో విక్రయిస్తున్నాను. సాధారణ పంటలతో ఆదాయం అంతంతమాత్రంగా ఉండటంతో పాటు సీజనల్‌గా రైతులంతా ఒకేసారి అధికంగా ఉత్పత్తి చేస్తుండటంతో భారీగా నష్టాలను చవిచూస్తున్నాను. ఈ పరిస్థితిని అధిగమించేందుకు కొంత భిన్నంగా ముందుకు సాగాలనుకున్నాను. మార్కెట్‌లో డిమాండ్ ఎక్కువగా ఉన్న బ్రొకలిని పండించేందుకు నడుంకట్టాను. గత కొన్నేళ్లుగా నాకున్న పొలంలోని 80 సెంట్లలో బ్రొకలి పండిస్తున్నాను. మంచి దిగుబడి సాధించే దిశగా నిపుణుల సలహాలు తీసుకున్నాను. ప్రస్తుతం 80 సెంట్లలో టన్ను వరకు దిగుబడి సాధిస్తున్నాను. బ్రొకలిలో పోషక విలువలు పుష్కలంగా ఉండటంతో వినియోదారుల నుంచి డిమాండ్ ఉంది. బయట మార్కెట్‌లో దీని ధర కేజీ రూ.200 ఉండగా రైతు బజార్‌లో రూ.80కి విక్రయిస్తున్నాం. దీని ద్వారా ఏటా రూ.2 లక్షల వరకు ఆదాయం వస్తోంది. కాలీప్లవర్ సాగుతో రూ.లక్ష ఆదాయం వస్తే, అదే విస్తీర్ణంలో బ్రొకలితో రూ.2లక్షలు ఆదాయం వస్తోంది. దీంతో రానున్న రోజుల్లో మరింత విస్తీర్ణంలో పంట సాగుచెయ్యాలని భావిస్తున్నాను.
– బొట్టా అప్పారావు, రైతు సంతపాలెం


